కారేపల్లి, జూలై 25: ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లిలో కోతులు (Monkey) హల్చల్ చేస్తున్నాయి. గ్రామంలో అక్కడా.. ఇక్కడా.. అని కాకుండా ప్రతీ వీధిలో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇండ్లల్లోకి చొరబడి అందిన వస్తువులు ఎత్తుకెళ్లడంతోపాటు మనుషులపై దాడులు చేస్తున్నాయి.
వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు బస్టాండ్ సెంటర్లో కిరాణం, కూరగాయలు, పండ్ల దుకాణాల్లో వస్తువులు తీసుకుని వెళ్లేవారి చేతుల్లో ఉన్న కవర్లను లాక్కొని వెళ్తూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
ఇటీవల ఈ పరిణామాలు అధికంగా చోటు చేసుకుంటుండడంతో కూరగాయల కవర్లు చేతిలో పట్టుకోవాలంటేనే జనం వణికిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.