భద్రాచలం, జనవరి 25: భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థాన పరిధిలోని చిత్రకూట మండపంలో బుధవారం ఆలయ అధికారులు, నేండ్రగంటి అలివేలు మంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్, శ్రీచక్ర సిమెంట్స్ (హైదరాబాద్, నాదసుధా తరంగిణి కల్చరల్ ట్రస్ట్ (విశాఖపట్నం), సామగాన లహరి కల్చరల్ ట్రస్ట్ (విజయవాడ) ఆధ్వర్యంలో ఘనంగా వాగ్గేయకారుడు భక్తరామదాసు (కంచెర్ల గోపన్న) 390వ జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే వేడుకల్లో తొలిరోజు దేశ నలుమూలల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు, కళాకారులు భక్త రామదాసు కీర్తనలు ఆలపించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి నవరత్న కీర్తనలతో స్వామివారికి స్వరాభిషేకం చేశారు. అర్చకులు భక్త రామదాసు విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్త రామదాసు చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ చేపట్టారు. నగర సంకీర్తన చేస్తూ గోదావరి తీరానికి చేరుకొని గోదావరి మాతకు పూజలు చేశారు.
భద్రాచలం సీతరామచంద్రస్వామి దేవస్థాన పరిధిలో 1968లో ధర్మకర్తల మండలి ప్రారంభమైంది. 1973 నుంచి భక్తరామదాసు వాగ్గేయకారోత్సవాలు జరుగుతున్నాయి. నాడు ప్రఖ్యాత గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, వాణీ జయరాం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి వంటి ప్రముఖులు తమ గానామృతంతో భద్రాద్రి రామయ్యను పరవశింపజేశారు.