భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదం చివరికి విషాదాంతమైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి దాదాపు 12 గంటలపాటు కొనసాగిన రెస్క్యూ బృందాల ఆపరేషన్ గురువారం తెల్లవారుజామున సగభాగం ఫలించింది. శిథిలాల్లో చిక్కుకుపోయిన తాపీ మేస్త్రీ కామేశ్వరరావును అధికారులు ప్రాణాలతో బయటకు తీశారు. కానీ అప్పటికే కాలు, చెయ్యి నుజ్జునుజ్జయి, తీవ్ర రక్తస్రావం జరిగిన నేపథ్యంలో ఆసుపత్రికి తరలించిన వెంటనే అతడు ప్రాణాలు వదిలాడు.
మరోవైపు ఇంకో తాపీ మేస్త్రీ ఉపేందర్ కోసం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం వరకూ అతడి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసుల జాగిలాలతో ఆనవాళ్లు గుర్తించి.. ఆ ప్రాంతంలో శిథిలాలను తొలగిస్తున్నారు. కాగా, తమకు న్యాయం చేయాలంటూ కామేశ్వరరావు కుటుంబీకులు, ఉపేందర్‌ను బయటకు తీయాలంటూ అతడి కుటుంబీకులు భద్రాచలం గోదావరి బ్రిడ్జి వద్ద గురువారం ఉదయం రాస్తారోకో చేశారు. కాగా, 30 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్, శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.
– భద్రాచలం, మార్చి 27
శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిన విషయం విదితమే. ఆ సమయంలో ఆ భవనంలో పలువురు ఉన్నట్లు ప్రచారం జరిగినప్పటికీ ఇద్దరు తాపీ మేస్త్రీలు ఉన్నట్లు మాత్రం తాజాగా అధికారులు నిర్ధారిస్తున్నారు. అయితే, బుధవారం మధ్యాహ్నం నుంచి శిథిలాల తొలగింపు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది.
ఒక తాపీ మేస్త్రీ కామేశ్వరరావును గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. చికిత్సపొందుతూ అతడు మృతిచెందాడు. మరో తాపీ మేస్త్రీ ఉపేందర్ ఆచూకీ కోసం జాగిలాల సహాయంతో స్థలాన్ని గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెన్క్యూ సిబ్బంది ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం దాకా ఉపేందర్ ఆచూకీ లభించలేదు. కాగా, శిథిలాలను తొలగిస్తుండగా బీరువా లాంటి లాకర్ ఒకటి లభ్యమైంది. అందులో విలువైన బంగారం, నగదు, వివిధ పత్రాలు ఉండడంతో అధికారులు దానిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న పీవో, ఆర్డీవో, ఏఎస్పీ..
శిథిలాల తొలగింపు ప్రక్రియను, సహాయక చర్యలను ఐటీడీఏ పీవో రాహుల్, ఆర్డీవో దామోదర్‌రావు, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్, డీఎఫ్‌వో క్రాంతికుమార్‌లు పర్యవేక్షిస్తున్నారు. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పంచాయతీ, ఐటీసీ అధికారులు, సిబ్బంది శిథిలాలను పలు చోట్ల తొలగిస్తూ, ఆనవాళ్లు పరిశీలిస్తూ ముందుకెళ్తున్నారు. ఉపేందర్ శిథిలాల కిందనే పడి ఇప్పటికే మృతిచెంది ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. కాగా, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఘటనా స్థలం వద్ద గురువారం ఉదయం కామేశ్వరరావు, ఉపేందర్ కుటుంబ సభ్యులు ఆందోళ నిర్వహించారు.
ప్రాణాలతో బయటికొచ్చి.. అంతలోనే ఆయుష్షు వీడి..
గురువారం తెల్లవారుజామున కామేశ్వరరావును కొన ఊపిరితో రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. అతడు ప్రాణాలతో ఉండడంతో అతడి కుటుంబ సభ్యులు, అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా అతడి కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషించారు. కానీ వారి ఆశలు గంట వ్యవధిలోనే ఆవిరయ్యాయి. వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా అతడు ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
కామేశ్వరరావు తండ్రి వెంకటేశ్వరరావు ఏడాది క్రితమే మృతిచెందాడు. ఇంతలోనే కొడుకు కూడా మృతిచెందడంతో ఆ తల్లి దుఃఖాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. అలాగే, ఉపేందర్‌ను బయటకు తీయాలని అతడి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు గోదావరి బ్రిడ్జి సెంటర్లో ఆందోళన చేశారు. అక్కడ ఉపేందర్ కుటుంబ సభ్యులను దళిత సంఘాల నాయకులు పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ సహా పలు పార్టీల పరామర్శ..
ఉపేందర్, కామేశ్వరరావు కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, ఆకోజు సునీల్ తదితరులు ఘటనా స్థలంలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని, రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు కూడా పరామర్శించి ఉపేందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, సీపీఎం నాయకులు కూడా బాధితుల కుటుంబాలను పరామర్శించారు.
అర్ధరాత్రి వరకూ మరో మృతదేహం?
శిథిలాలు తొలగిస్తున్న రెస్క్యూ బృందాల సభ్యులు ఓ ప్రాంతంలో దుర్వాసన వస్తుండడాన్ని గుర్తించారు. అక్కడ యంత్రాలతో తవ్వకాలు నిలిపివేసి సాధారణ డ్రిల్లింగ్ ద్వారా గొయ్యి తీసి ముందుకెళ్తున్నారు. గురువారం అర్ధరాత్రి, లేదా శుక్రవారం తెల్లవారుజాము లోపు ఉపేందర్ ఆచూకీ లభ్యమయ్యే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఉపేందర్ ఆ శిథిలాల్లో చిక్కుకొని ఇప్పటికే 48 గంటలు దాటిపోవడంతో అతడు బతికి ఉంటాడన్న ఆశ ఆవిరైందని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
ఇంటెలిజెన్స్ బృందాల ఆరా..
భవన నిర్మాణదారుడు శ్రీపతి శ్రీనివాస్ గురించి పోలీసు ఇంటెలిజెన్స్ బృందాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. ‘ఇంత వివాదాస్పద కట్టడాన్ని ఎలా నిర్మించాడు? శ్రీనివాస్ గత చరిత్ర ఏమిటి?’ అనే విషయాలను తెలుసుకుంటున్నాయి. గతంలో ఇతడు మావోయిస్టులకు సహకరించాడనే ఆరోపణలు, కేసు ఉన్నాయి. ‘మౌలా శ్రీను అనే వ్యక్తిగా ఉండే ఇతడు ట్రస్టు నిర్వాహకుడిగా ఎలా మారాడు? ట్రస్టుకు విరాళాలు ఎలా అందాయి’ అనే అంశాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు సమయంలో వివరాలన్నీ బలంగా ఉండేలా పోలీసులు ముందుగానే ఆరా తీస్తున్నారు.