ఖమ్మం రూరల్, అక్టోబర్ 25 : పాలేరును పాలించుకునే దమ్ము, సత్తా ఇక్కడి ప్రజలకు ఉన్నదని, పరాయి వాళ్ల పాలన పాలేరు నియోజకవర్గ ప్రజలకు అవసరం లేదని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పొలిశెట్టిగూడెంలో.. తీర్థాల, పొలిశెట్టిగూడెం, మద్దివారిగూడెం గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు వందలాది మంది ఎమ్మెల్యే కందాళ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తొలుత గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మూడు గ్రామాల పార్టీ బాధ్యులు, నూతనంగా పార్టీలో చేరిన వారినుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. పాలేరు అంటే నాకు ఆశ, శ్వాస అని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాలేరు రెండో ప్రాధాన్యత అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను బేధాభిప్రాయాలు లేకుండా ఇంటింటికీ అందించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు గ్రామాల్లో విశేష స్పందన కనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింతగా కష్టపడి పనిచేసి తనను గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, తీర్ధాల సర్పంచ్ బాలునాయక్, ఏదులాపురం సొసైటీ మాజీ చైర్మన్ ధర్మారెడ్డి, ప్రస్తుత చైర్మన్ లక్ష్మణ్నాయక్తోపాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ, బూత్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
పొలిశెట్టిగూడెంకు చెందిన పెంటాల కోటయ్య కందాళ అభిమాని. అయితే మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్యే కందాళ నామినేషన్ వేయనున్నందున తనవంతుగా కోటయ్య నామినేషన్ ఫీజు రూ.10,116ను అందజేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను సాయం చేస్తాను. కానీ.. అభిమాని నాకు సాయం చేయడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు.