– ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్
ఖమ్మం, రూరల్, జూన్ 19 : ఖమ్మం రూరల్ మండల పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా, నియమిత గడువు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గం పరిధిలో కలెక్టర్ పర్యటించారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో రూ.108 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలు, ప్రధాన భవనం, అకాడమిక్ బ్లాక్ నిర్మాణాల పనుల పురోగతిని పరిశీలించారు. కార్మికులను పెంచి అనుసంధానంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పొన్నేకల్‌లో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ ప్రాంతాలను తిరుగుతూ పనుల నాణ్యతను, భవనాల నమునా మ్యాప్ లను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల వద్ద లింక్, అంతర్గత రోడ్డు, ప్రణాళిక ప్రకారం 4 జూనియర్, 9 సీనియర్ హాస్టల్ బ్లాకులు, వెయిటింగ్ హాల్, అకాడమిక్ బ్లాక్ భవనాల నిర్మాణంకు కార్మికులకు అత్యధికంగా పెంచి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం పూర్తయితే స్థానిక యువతకు సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చి, వారి భవిష్యత్‌కు బలమైన పునాది ఏర్పడుతుందని అన్నారు. అదే విధంగా యంగ్ ఇండియా స్కూల్ పూర్తి కావడంతో పరిసర ప్రాంతాల విద్యార్థులకు మంచి విద్య అవకాశాలు అందుతాయని తెలిపారు. పనుల నాణ్యతపై ఎటువంటి రాజీ ఉండకూడదని, ప్రతి దశలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఇంజినీరింగ్ అధికారి బుగ్గయ్య, ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ ఎం.వినయేందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి’