బూర్గంపహాడ్, ఏప్రిల్ 12: ‘కార్మిక సమస్యలంటే ఐటీసీ సంస్థకు పట్టింపులేదా? దీక్షలు చేస్తున్నా యాజమాన్యానికి కనువిప్పు కలగదా?’ అంటూ ఐటీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు, కాంట్రాక్టు కార్మికులు ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రిలే దీక్షలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం మొండి వైఖరితో ఉండడం దారుణమని అన్నారు. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల సారపాకలోని ఐటీసీ కర్మాగారం ఎదుట కొనసాగుతున్న రిలే దీక్షలు ఆదివారంతో 18వ రోజుకు చేరుకున్నాయి.
ఈ దీక్ష శిబిరంలో కార్మికులు ఎస్.లక్ష్మి, కే.రాణి, కే.పద్మ, ఎం.పద్మ తదితరులు కూర్చున్నారు. ఐఎన్టీయూసీ నేతలు జలీల్‌ఖాన్ తదితరులు పాల్గొని కాంట్రాక్టు కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం, కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్‌పాషా మాట్లాడుతూ.. కార్మికుల న్యాయమైన సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకుండానే 13వ వేతన ఒప్పందం కాలం ముగిసిపోయిందని అన్నారు.
అయినా నేటికీ ఆ సమస్యలు పరిష్కారం కావడంలేదని, దీక్షలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యానికి కార్మికులపై కనికరం కలగడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కార్మిక సంఘ నాయకులను చర్చలకు పిలిచి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.