మణుగూరు టౌన్, ఏప్రిల్ 9 : ఆరోగ్య సమస్యలు, ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురై ఆస్పత్రికి వచ్చే గిరిజనులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. మణుగూరు పట్టణంలోని వంద పడకల ఆస్పత్రిని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ప్రతీ వార్డును కలియతిరిగి గిరిజనులకు అందిస్తున్న వైద్య సౌకర్యాల గురించి మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా గర్భిణుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అనంతరం మణుగూరు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను తనిఖీ చేసి.. రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్ రికార్డులను పరిశీలించారు. యువతీ యువకులు తప్పులు లేకుండా దరఖాస్తులు పూర్తి చేసి తప్పనిసరిగా ఆన్లైన్ చేయించాలని చెప్పారు. కార్యక్రమంలో మణుగూరు తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ చైతన్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.