దుమ్ముగూడెం, ఫిబ్రవరి 21: ఇంగ్లిష్, గణితంలో కనీస సామర్థ్యాల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఉద్దీపకం వర్క్‌బుక్స్, వేదిక్ మ్యాథ్స్ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు.
రామచంద్రునిపేట, రేగుబల్లి-2 ఆశ్రమ పాఠశాలలను శుక్రవారం సందర్శించిన ఆయన ఉద్దీపకం వర్క్‌బుక్స్, వేదిక్ మ్యాథ్స్‌కు సంబంధించి పాఠ్యాంశాలను విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారనే విషయాన్ని స్వయంగా ఆయన పరిశీలించారు. విద్యార్థులతో బోర్డుపై రాయించి ఒక్కో విద్యార్థిని లేపి ప్రగతిని పరిశీలించారు.
3 నుంచి 5 తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఇంగ్లిష్ చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో వెనుకబడిపోతున్నందున వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఫిజిక్స్, బయోసైన్స్ ల్యాబ్‌ను పరిశీలించి అవసరమైన సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. పాఠశాలల్లో త్రీఫేజ్ కరెంటు, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం ఏమైనా మరమ్మతులు ఉంటే తప్పకుండా చేయిస్తామన్నారు. హెచ్ఎంలు బట్టు రాములు, భారతమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.