బూర్గంపహాడ్, జూన్ 18: ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ‘ధర్తి అబా జన్ భాగిదారి’ కార్యక్రమంపై కృష్ణసాగర్ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో పీవో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ పథకం కింద ఏజెన్సీ ప్రాంతంలోని 130 పంచాయతీలను ఎంపిక చేశారని, అందులో కృష్ణసాగర్ పంచాయతీ ఉందన్నారు.
ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఉండాలని, వాటిని అధికారులే వచ్చి గ్రామస్తుల సమక్షంలో అందిస్తారని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలకు అవసరమైన కార్డులు రిజిస్ట్రేషన్ చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పీవో గిరిజనులకు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీవో బాలయ్య, ఏవో శంకర్, ఈజీఎస్ ఏపీవో విజయలక్ష్మి, ఆర్ఐ నర్సింహారావు, ట్రాన్స్కో ఏఈ గుర్రం ఉపేందర్, మోరంపల్లి బంజర్ వైద్యురాలు లక్ష్మీసాహితి, ఐకేపీ ఏపీఎం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.