బూర్గంపాడు, మార్చి 12 : గిరిజన రైతులు సేంద్రియ సాగుపై మెళకువలు నేర్చుకోవాలని, సాగులో వారికి సలహాలు సూచనలు అందించే బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అభ్యుదయ రైతు లక్ష్మారెడ్డికి సూచించారు. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, అలాంటి పంటలు పండించడానికి రైతులు మొగ్గు చూపాలన్నారు.
గట్టు లక్ష్మీపురం గ్రామంలో అభ్యుదయ రైతు లక్ష్మారెడ్డి సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్న పుచ్చకాయ, మిరప, జామ పంటలను బుధవారం పీవో పరిశీలించారు. పం సాగు విధానం, యాజమాన్య పద్ధతుల గురించి రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీవో రాహుల్ మాట్లాడుతూ గిరిజన రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించడానికి ఆర్గానిక్ పంటలు వేసుకుంటే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చన్నారు.
ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్న లక్ష్మారెడ్డిని గిరిజన రైతులు ఆదర్శంగా తీసుకొని సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. పామాయిల్ మొక్కలు పెంచుతూ అంతర పంటగా పుచ్చ, మిరప సాగు చేస్తున్న విధానం చాలా బాగుందన్నారు. కార్యక్రమంలో ఏడీ అగ్రికల్చర్ ఉదయభాస్కర్, హార్టికల్చర్ అధికారి వేణుమాధవ్ పాల్గొన్నారు. అనంతరం సారపాకలోని గాంధీనగర్ జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధస్సుతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న తరగతులను ఆయన పరిశీలించారు.