భద్రాచలం, మార్చి 1 : విద్యార్థుల ఆరోగ్యం విషయంలో హెచ్ఎంలు, వార్డెన్లు, ఏఎన్ఎంలు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ హెచ్చరించారు. పట్టణంలోని బీఈడీ కళాశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని హెచ్ఎం, వార్డెన్, ఏఎన్ఎంలతో వృత్యంతర శిక్షణా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్ఎంలు పని చేస్తున్న చోటే నివాసం ఉంటూ పిల్లల ఆరోగ్య స్థితిగతులను గమనిస్తుండాలని అన్నారు.
అనారోగ్యంతో బాధపడే విద్యార్థులను గుర్తించి దగ్గర్లోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం చేయించాలని సూచించారు. మీ పరిధి పీహెచ్‌సీల్లోని వైద్యులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హెచ్ఈవోలతో సమన్వయంగా ఉంటూ ప్రతి నెలా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. కిశోర బాలికలకు అవసరమైన వైద్య పరీక్షలు మహిళా వైద్యులచే చేయించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి చదువుతోపాటు వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చూసే బాధ్యత హెచ్ఎం, వార్డెన్లపై ఉందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ మణెమ్మ, విజయలక్ష్మి, ఏసీఎంవో రమణయ్య, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరూనాయక్, వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో చైతన్య, ఏటీడీవోలు పాల్గొన్నారు.