చండ్రుగొండ, ఫిబ్రవరి 18: విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. తిప్పనపల్లి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల, చండ్రుగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో డిక్టేషన్ చెప్పి, బోర్డుపై తెలుగు, ఇంగ్లిష్ పదాలను రాయించారు. భవిష్యత్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీ ఊరికి ఏం కావాలి? మీ పాఠశాలకు ఏం కావాలి? అనే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
కోతుల సమస్య ఉందని చెప్పగా.. సోలార్ ఫెన్సింగ్ వేయిస్తానని, త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల మరమ్మతు పనులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థినులకు ప్రత్యేకంగా ఇచ్చిన ఉద్దీపకం పుస్తకాన్ని చదివి, రాయించాలన్నారు. గణితంపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు 1 నుంచి 5 తరగతి విద్యార్థినులపై శ్రద్ధ పెట్టాలన్నారు. పీవో వెంట పాల్వంచ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం భద్రు, ఏటీడీవో చంద్రమోహన్, హెచ్ఎంలు సునీత, ఇస్లావత్ వీరన్న ఉన్నారు.