భద్రాచలం, మార్చి 4: అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతాయని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. ఆయన సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన దర్బార్ నిర్వహించారు. గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్నింటిని వెంటనే పరిష్కరించారు. మిగతా వాటిని సంబంథిత యూనిట్ అధికారులకు పంపి, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజన దర్బార్‌లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారాప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తున్నామన్నారు. ఏపీవో (జనరల్) డేవిడ్‌రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ఎస్వో సురేష్‌బాబు, ఏపీవో (పవర్) మునీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం, మార్చి 4: ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రుణాలను స్వయం సహాయ సమూహ మహిళలు సక్రమంగా ఉపయోగించుకుని జీవనోపాధిని మెరుగుపర్చుకోవాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ కోరారు. ఈ మహిళలు తాము తయారు చేసిన వివిధ రకాల వస్తువులను పీవో సోమవా రం ఐటీడీఏ కార్యాలయంలో పరిశీలించారు. జీసీసీ ద్వారా కొన్నింటిని కొనుగోలు చేశారు. ఆ మహిళలతో ఆయన మాట్లాడుతూ.. బ్యాంక్ రుణంతో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అధికారులు డేవిడ్ రాజ్, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.