బూర్గంపహాడ్, ఆగస్టు 12 : మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి బాధితులు సమర్పించిన అర్జీలను పరిశీలించి ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఐటీడీఏ ఏపీవో డేవిడ్‌రాజ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం భద్రాచలం ఐటీడీఏ మందిరంలో పీవో రాహుల్ ఆదేశాల మేరకు గిరిజన దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల గిరిజనులు సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
కాగా.. పోడు భూములకు పట్టాలు, పట్టాల్లో పేరు మార్పు, రైతుబంధు రుణాలు, వ్యక్తిగత, భూ సమస్యలు, విద్య కోసం ఆర్థిక సాయం, గిరిజన గ్రామాల్లో వ్యవసాయ సాగుకు విద్యుత్, బోరు, మోటరు, మంచినీటి సౌకర్యం, కొత్తగా మత్స్యకార సొసైటీల ఏర్పాటు తదితర అంశాలపై అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో గురుకులం ఆర్సీవో నాగార్జునరావు, డీఎంజీసీసీ దావీద్, ఏడీ అగ్రికల్చర్ భాస్కర్, కొండరెడ్ల అధికారి నరేశ్, ఏపీవో పవర్ మునీర్‌పాషా, డీటీఆర్వోఎఫ్ఆర్ శ్రీనివాస్, ఉద్యానవన అధికారి ఉదయ్‌కుమార్, మేనేజర్ ఆదినారాయణ, ట్రైబల్ వెల్ఫేర్ పర్యవేక్షకురాలు ప్రమీలాబాయి, మిషన్ భగీరథ ఏఈ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.