కూసుమంచి, జూన్ 25 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. కూసుమంచి హైస్కూల్‌ను మంగళవారం తనిఖీ చేసిన ఆయన హెచ్ఎం రాయల వీరస్వామిని పాఠశాల అవసరాలు, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు దృష్టి సారించి వారికి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. విద్యార్థుల హాజరు, వారి చదువు, ఆటలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయకపోతే పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అనంతరం విద్యార్థులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తల్లిదండ్రుల కలలను నిజం చేయడానికి చిన్నతనం నుంచే కష్టపడి చదువుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరం కూసుమంచి ఉన్నత పాఠశాలలో అత్యధికంగా అడ్మిషన్లు చేయడం పట్ల ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, ఎంఈవో రామాచారి, ఉపాధ్యాయుడు రేలా విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.