ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 14: రాష్ట్రం సిద్ధించిందే తడవుగా తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షాన నిలిచింది. పంట చేల వద్ద ఆరుగాలం చెమటోడ్చే రైతు కష్టాన్ని తన కష్టంగా భావించింది. నిరంతరం సాగు పనుల్లో నిమగ్నమయ్యే రైతన్నకు ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ముందస్తుగా బీమా ప్రీమియం సొమ్ము చెల్లిస్తోంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే బీమా సొమ్ము రూ.5లక్షలు చెల్లించి ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తోంది. రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఐదేళ్లయిన సందర్భంగా ‘నమస్తే’ కథనం.
రైతుల కుటుంబాలకు రక్షణ కవచంలా ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఐదో ఏటకు అడుగు పెట్టింది. పథకం ఉద్దేశం పూర్తిస్థాయిలో నెరవేరి.. అనేక మంది అన్నదాతల కుటుంబాలను ఆదుకున్నది. సమయంతో సంబంధం లేకుండా అన్ని వేళలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే అన్నదాతలు అనేక రకాల కారణాలతో మృత్యువాత పడేవారు. పాముకాట్లు, పిడుగుపాట్ల దగ్గర నుంచి మొదలుకొని విద్యుదాఘాతాలు, ఇతర ప్రమాదాల బారిన పడేవారు. దీంతో ఆ రైతుపై ఆధారపడిన అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయేది. ఒక్కోసారి ఆ రైతు పంటల సాగు కోసం అప్పులు చేసి ఉంటే అవన్నీ మిగిలిన కుటుంబ సభ్యులపై పడేవి. ఒకవేళ రైతు పిల్లలు చిన్నవాళ్లయితే అతడి భార్యే గుండె ధైర్యంతో నాగలి మేడి చేతపట్టాల్సి వచ్చేది. కొన్ని ఇంకా దయనీయ పరిస్థితులు ఉంటే ఆ రైతు కుటుంబం రోడ్డున పడేది. దీంతో తెలంగాణలో రైతులెవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని సంకల్పించిన సీఎం కేసీఆర్.. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతుబీమా పథకాన్ని తెచ్చారు. 2018 ఆగస్టు 14న అర్ధరాత్రి నుంచి మొదలైన ఈ పథకం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎన్నో రైతు కుటుంబాలకు అండగా ఉంటూ వస్తోంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా..
మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న రైతుబీమా పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. రైతు ఏ కారణంతో మృతిచెందినా పరిహారం అందడం ఈ పథకం గొప్ప ఉద్దేశం. ఇందులో భాగంగా భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఒక్కో రైతు తరఫున రాష్ట్ర ప్రభుత్వమే రూ.3,484 బీమా ప్రీమియాన్ని చెల్లిస్తోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 18 – 59 ఏళ్ల మధ్య వయసు, పట్టాదారు పాసుపుస్తకం కలిగిన 1.95 లక్షల మంది రైతులకు ఈ బీమా వర్తిస్తోంది. 2018 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన పథకం నిరాటంకంగా కొనసాగుతోంది. ఏటా ఇదే రోజున తదుపరి ఏడాదికి కూడా రైతుల తరఫున ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తోంది. ఈ క్రమంలో కొత్త పట్టాదారు పాస్ బుక్ పొందే రైతులను కూడా ఎప్పటికప్పుడు ఇందులో జమ చేస్తోంది. ఇలా ఈ ఐదేళ్లలో ఖమ్మం జిల్లాలో 4,694 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా.. వీరిలో 4,552 మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం మంజూరైంది. ఈ మొత్తం కూడా రైతు కుటుంబంలోని నామినీ ఖాతాలో జమ అయింది. అది కూడా రైతు మరణించిన రెండు వారాల వ్యవధిలోనే కావడంతో అన్నదాతల కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతున్నాయి. ఇలా ఇన్నేళ్లలో ఒక్కో రైతుకు రూ.5 లక్షల చొప్పున మొత్తం 4,552 మంది అన్నదాతల కుటుంబాలకు రూ.227 కోట్ల బీమా పరిహారం అందినట్లయింది.
ఎలాంటి రిస్క్ జరిగినా సకాలంలో పరిహారం..
రైతుబీమా పథకం అమలులో మూడంచెల పర్యవేక్షణ ఉంటుంది. గ్రామస్థాయిలో వ్యవసాయశాఖ విస్తరణ అధికారి (ఏఈవో)లు తక్షణం స్పందించి రైతు వివరాలను సేకరించి ఆదే రోజు పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. దీనిపై మండల వ్యవసాయ అధికారి (ఏవో) మరోసారి పర్యవేక్షణ చేస్తారు. సాంకేతికపరమైన చిక్కులుంటే అధిగమించేందుకు జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా నోడల్ అధికారి కూడా ఉన్నాడు. దీంతో ప్రక్రియ అంతా వేగంగా జరుగుతుంది. రైతులకు ఎలాంటి రిస్క్ జరిగినా రైతు కుటుంబాలకు సకాలంలో పరిహారం అందుతుంది.
-ఎం.విజయనిర్మల, డీఏవో, ఖమ్మం
రైతుబీమాతో ఎంతో మేలు జరిగింది..
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ రైతుబీమా పథకం వల్ల మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. పంట చేలో కోతులను వెళ్లగొడుతున్న క్రమంలో భర్త అక్కడే కింద పడ్డాడు. చాలా సమయం తరువాత గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్తే బ్రెయిన్ డెడ్ అయిందన్నారు. నెల రోజులు మృత్యువుతో పోరాడి మరణించాడు. ఈ క్రమంలో చికిత్స కోసం రూ.3 లక్షలు అప్పు చేశాం. అప్పటికే పంటల సాగు కోసం తెచ్చిన అప్పులూ ఉన్నాయి. ఇవన్నీ మా గుండెలపై మరింత భారాన్ని మోపాయి. ఇదే సమయంలో ఆయన మరణించిన 15 రోజుల్లోనే రైతుబీమా పథకం ద్వారా రూ.5 లక్షల పరిహారం నా ఖాతాలో జమ అయింది. కుటుంబం నిలదొక్కుకోవడానికి అండగా నిలిచింది.
-పడిగల రాజ్యం, రైతు భార్య, ఎం.వెంకటాయపాలెం, ఖమ్మం రూరల్ మండలం