ఖమ్మం, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లా విద్యాశాఖలో సర్వీస్ రిజిస్టర్ల(ఎస్ఆర్)కు భద్రత లేనట్లుగా కనిపిస్తున్నది. ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవుల కోసం ఇంటి నుంచి ఆఫీసుకు ఎస్ఆర్లను తీసుకెళ్లి తీసుకొస్తుండడంతో వాటి భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నది. ఉద్యోగి నియామకమైనప్పటి నుంచి మొదలుకొని పదవీ విరమణ అనంతరం పింఛన్ చెల్లింపు వరకు జరిగే మార్పులన్నీ ఎస్ఆర్లో నమోదు చేస్తారు. ఉద్యోగి జీవితంలో ఎస్ఆర్(సేవా పుస్తకానికి) ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఎస్ఆర్లో అన్ని వివరాలు నమోదు చేసి ధ్రువీకరించాల్సిన బాధ్యత కార్యాలయ అధికారిపై ఉంది. ఉద్యోగికి తన ఎస్ఆర్ను చూసుకొనే హక్కు ఉన్నప్పటికీ కార్యాలయ అధికారి మాత్రమే పర్యవేక్షించాలి. కానీ.. ఇందుకు భిన్నంగా విద్యాశాఖలో జరుగుతున్నది. కార్యాలయ అధికారి పర్యవేక్షణలో ఉండాల్సిన సిబ్బంది సర్వీస్ రిజిస్టర్లు కార్యాలయంలో కాకుండా సిబ్బంది ఇళ్ల వద్ద ఉంటున్నాయి. ఏడాది కాలంగా ఇదే పద్ధతిలో నిర్వహణ సాగిస్తున్నారు. ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవుల సమయంలో ఇళ్ల నుంచి తీసుకొచ్చి మళ్లీ ఎస్ఆర్లను తీసుకెళ్తున్నట్లు తెలుస్తున్నది.
బాధ్యత ఎవరిది..
ఉద్యోగికి సర్వీస్ పుస్తకం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడితే ఉద్యోగి నుంచి ఒక అర్జీపత్రం తీసుకోవడం తప్పనిసరి. ఎస్ఆర్ అతడికి ముట్టినట్లుగా డిక్లరేషన్ను కూడా తప్పకుండా తీసుకోవాలి. దీనికి డ్రాయింట్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్(డీడీవో) పూర్తి బాధ్యుడిగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యోగ జీవితంలో కీలకపాత్ర పోషించే ఈ సర్వీస్ రిజిస్టర్పై విద్యాశాఖలో పర్యవేక్షణ కొరవడింది. జీవో 152 ప్రకారం ఉద్యోగి బదిలీ అయిన సందర్భంలో కూడా అతడి ఎస్ఆర్.. బదిలీ అయిన కార్యాలయ అధికారికి పోస్టు ద్వారా పంపించాలి. కానీ.. బదిలీ అయిన ఉద్యోగికి సర్వీస్ రిజిస్టర్ ఇచ్చి పంపకూడదు. వీటన్నింటినీ పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.. ఎస్ఆర్పై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు.
ఏడాదిగా ఇదే తంతు..
ప్రతీ ఉద్యోగికి సర్వీస్ రిజిస్టర్ ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే అతడి రిటైర్మెంట్ తరువాత అన్ని రకాల సౌలభ్యాలూ అందుతాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన సర్వీస్ రిజిస్టర్ను కార్యాలయంలో ఉంచకుండా కొందరు అధికారులు, సిబ్బంది తమ వద్దే ఉంచుతున్నారు. ఏడాది కాలంగా ఇదే విధంగా కొనసాగుతోంది. బదిలీల కంటే ముందు ఓ మహిళా ఉద్యోగి.. తన వద్ద ఉన్న ఎస్ఆర్లను సిబ్బందికి అందజేశారు. తాను బదిలీ అయిన తర్వాత సెక్షన్ కేటాయించిన ఉద్యోగికి సిబ్బంది ఎస్ఆర్లను అందజేయలేదు. ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవులు ఇతరత్రా అంశాల నమోదు కోసం వాటిని సదరు సిబ్బంది తమ ఇంటి వద్ద నుంచి తీసుకురావడం, నమోదు అనంతరం మళ్లీ తీసుకువెళ్లడం వంటివి జరుగుతున్నాయి. ఇలా తీసుకెళ్లి తీసుకొచ్చే సమయంలో ఎస్ఆర్కు ఏదైనా జరిగితే సదరు ఉద్యోగి భవిష్యత్ ఏంటన్నది ప్రశ్నార్థకమవుతోంది.
సెక్షన్ల మార్పులు..
జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అన్ని విభాగాల్లో అన్ని హోదాల్లో కలిపి సుమారు 53 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. సెక్షన్ల ఆధారంగా వీరు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా నలుగురైదుగురు మినహా సిబ్బంది అందరికీ సెక్షన్లు మార్పులు చేశారు. రెవెన్యూ నుంచి విద్యాశాఖలోకి వచ్చిన ఉద్యోగికి ఎస్ఆర్ల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. సెక్షన్లు కేటాయించే సమయంలో కూడా ఎస్ఆర్లు కార్యాలయంలో లేవనే విషయం కూడా తెలియకపోవడం గమనార్హం.
తెప్పించి భద్రపరుస్తాం..
పాత కార్యాలయం నుంచి నూతన కలెక్టరేట్లోకి మా శాఖను మార్చిన సమయంలో పూర్తిస్థాయిలో బీరువాలు తీసుకొచ్చేందుకు అనుమతించలేదు. సర్వీస్ రిజిస్టర్లు కార్యాలయంలోనే ఉండాలి. ఒకటి రెండు రోజుల్లో సిబ్బంది నుంచి సర్వీస్ రిజిస్టర్లు తెప్పించి మా కార్యాలయంలో భద్రపరుస్తాం.