గత కేసీఆర్ ప్రభుత్వంలో గోదావరి జలాలతో నింపేందుకు తొలి ప్రాధాన్యంగా ఎంపికైన రోళ్లపాడు ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం పక్కనబెట్టింది. ఫలితంగా ఆ రోళ్లపాడు ఆయకట్టు అన్నదాతలు ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కనీసం తూముల మరమ్మతులకు చొరవ చూపని కారణంగా.. దాని కింద వరి సాగు చేసిన రైతులు తమ పంటలపై ఆశలు వదులుకోవాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.
రోళ్లపాడు జలాలపై భరోసాతో యాసంగిలో వరి సాగు చేసిన 120 ఎకరాల్లో ఇప్పుడు ఏకంగా 80 ఎకరాల మేర నెర్రెలు వారడం.. రోళ్లపాడు ప్రాజెక్టు పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. సదరు ప్రాజెక్టులోని జలాలపై నమ్మకంతో వందకు పైగా ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తున్నారన్న స్పృహ లేకపోవడం, కనీస మరమ్మతులు చేయించి కర్షకులకు సాగునీరు అందించాలన్న సోయి లేకపోవడం వంటి కారణాలతో చివరికి అన్నదాతలే తమ పంటలను కోల్పోవాల్సి వచ్చింది.
-ఇల్లెందు, మార్చి 12
జిల్లాలోని అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి మొట్టమొదటగా టేకులపల్లి మండలం రోళ్లపాడు ప్రాజెక్టును నింపాలని, దీని ద్వారా ఈ ఏజెన్సీని సస్యశ్యామలం చేయాలని గత కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అనేక చర్యలు చేపట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. లింక్ కెనాళ్ల ద్వారా సీతారామ జలాలను పొరుగు జిల్లాలకు తరలిస్తూ ఈ రోళ్లపాడు ప్రాజెక్టుపై శీతకన్ను వేసింది.
కనీసం ఈ ప్రాజెక్టు మరమ్మతులనూ పట్టించుకోలేదు. అయినప్పటికీ ఇందులోని నీటిపైనే ఆధారపడుతూ దీని ఆయకట్టు రైతులు పంటలు పండించుకుంటున్నారు. ఈ ఏడాది వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడం, ప్రాజెక్టులో నీరు నిండుగా ఉండడం వంటి కారణాలతో ఆయకట్టు రైతులు మంచిగానే పంటలు పండించుకున్నారు. వేసవిలో కూడా నీళ్లు మంచిగానే ఉండడంతో యాసంగికి మొగ్గు చూశారు. ఆయకట్టు పరిధిలో ఉన్న టేకులపల్లి మండలం బేతంపూడి, కోటల్ల, అబ్బిరెడ్డిగూడెం, టేకులపల్లి గ్రామాల రైతులు యాసంగి పంటగా సుమారు 120 ఎకరాల మేర వరి, పెసర, మినుము, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేశారు. ఎంతో పెట్టుబడిని వెచ్చించారు.
తీరా పంటలు చేతికి వచ్చే క్రమంలో రోళ్లపాడు ప్రాజెక్టు తూము గేటుకు లీకులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడి నుంచి నీళ్లు వృథాగా బయటకు వెళ్లిపోతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. తూము గేటుకు మరమ్మతులు చేయించలేదు. చివరికి నీళ్లన్నీ లీకయిపోయాయి. ఫలితంగా రైతులు సాగు చేసిన పంటలకు కీలకమైన దశలో చుక్కనీళ్లు కూడా అందలేదు. దీంతో రైతులు సాగు చేసిన 120 ఎకరాల్లో 80 ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయాయి. ముఖ్యంగా వరి పొలాలు నెర్రెలు వారాయి. దీంతో దిక్కులేని పరిస్థితుల్లో కొందరు రైతులు తమ వరి పొలాల్లో పశువులను మేపుతున్నారు.
ఆరుగాలం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకున్నప్పటికీ కాసింత ప్రయోజనం కూడా లేకపోయిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి రూ.వేలల్లో ఖర్చు చేసినప్పటికీ పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కాలువ దగ్గరలో ఉన్న రైతులు ఆయిల్ ఇంజిన్ల ద్వారా తమ పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ ఒక్క తడికి రూ.వేలల్లో ఖర్చవుతోందని చెబుతున్నారు. ఒకవేళ రెండు, మూడు తడులు అవసరమైతే ఖర్చు మరింత పెరుగుతోందని తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి తూముకు మరమ్మతులు చేసి ఉంటే పంటలు ఎండిపోయేవి కావని, తాము కూడా ఇంతలా నష్టపోయేవాళ్లం కాదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రోళ్లపాడు ప్రాజెక్టుకు గోదావరి జలాలను అందించి ఈ ప్రాంత రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
రోళ్లపాడు ప్రాజెక్టు కింద నాకు రెండు ఎకరాల సొంత పొలం ఉంది. దానికి తోడు యాసంగిలో మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకున్నా. మొత్తం ఎనిమిది ఎకరాల్లో వరి పంట వేశా. నాట్లు వేస్తున్నప్పుడు రోళ్లపాడు ప్రాజెక్టులో నీళ్లు చాలానే ఉన్నాయి. కానీ పంట పొట్టదశకు వచ్చిన క్రమంలో తూము నుంచి నీళ్లన్నీ వెళ్లిపోయాయి. చుక్క నీళ్లు కూడా రాకపోవడంతో ఎనిమిది ఎకరాలూ నెర్రెలు వారాయి. రూ.1.50 లక్షల పెట్టుబడిని మొత్తం నష్టపోయా. మా ప్రాంతానికి సీతారామ ప్రాజెక్టు నీటిని అందించాలి.
-నెల్లూరి సందీప్, రైతు, టేకులపల్లి
నాకు రెండెకరాల పొలం ఉంది. దానిలో ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో మొక్కజొన్న వేశా. నీళ్లు రాకపోవడంతో వరి మొత్తం ఎండిపోయింది. దీంతో మొక్కజొన్ననైనా కాపాడుకుందామని ఆయిల్ ఇంజిన్ ద్వారా నీళ్లు పెడుతున్నా. రోజుకు రూ.2 వేల ఖర్చు వస్తోంది. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాను. చేతికొచ్చిన పంట ఎండిపోతుండడంతో బాధగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తూమును రిపేరు చేసి ఉంటే నీటి సమస్య వచ్చేది కాదు. రోళ్లపాడుకు గోదావరి నీళ్లిస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
-ఏనుకు సోమయ్య, కోటల్ల, టేకులపల్లి మండలం
రోళ్లపాడు ప్రాజెక్టు తూము రిపేరుకొచ్చింది. కొత్తగా బిగించేందుకు షట్టర్ తెచ్చాము. కానీ నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల షెట్టర్ బిగించడం కుదరలేదు. ఇప్పుడు నీళ్లు తగ్గాయి. కాబట్టి త్వరలోనే ఆ షట్టర్‌ను ఏర్పాటు చేస్తాం. ఇది మైనర్ ప్రాజెక్టు. అందుకని వేసవి కాలం పంటలకు నీళ్లు పూర్తిస్థాయిలో అందవు.
-రవికుమార్, ఇరిగేషన్ డీఈ