– డీడీ ఆకస్మిక తనిఖీతో వెలుగులోకి
– హెడ్మాస్టర్, డిప్యూటీ వార్డెన్ కు షోకాజ్ నోటీసులు
కారేపల్లి, ఏప్రిల్ 11 : పేద గిరిజన బిడ్డలకు పౌష్టికాహారంతో కూడిన భోజనంతో పాటు ప్రమాణాలతో కూడిన విద్యను అందించి వారిని తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం కొందరి అక్రమార్కుల వక్ర బుద్ధులతో నీరుగారుతోంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ స్కూళ్లకు సకల సౌకర్యాలు సమకూర్చి అద్భుతమైన మెనూను రూపొందించి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నిర్వహణ లోపం వల్ల గిరిజన సంక్షేమ శాఖ లక్ష్యం నెరవేరడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గేట్ కారేపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను ఇటీవల ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయగా వారి అక్రమాలు వెలుగు చూసాయి. డీడీ స్వయంగా పరిశీలించిన అక్రమాలను చూస్తే డిప్యూటీ వార్డెన్, హెడ్మాస్టర్ కలిసి పేద గిరిజన పిల్లల పొట్టలు కొడుతున్న తీరు సభ్య సమాజాన్ని బాధించే అంశమే. పిల్లలకు కడుపు నిండా మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా వారి నోటికాడ కూడు తినడం అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్న వారి పట్ల అధికార యంత్రాంగం ఏ మాత్రం మానవత్వం చూపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది
గిరిజన సంక్షేమ శాఖ ఖమ్మం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ మార్చి 20వ తేదీన గేట్ కారేపల్లి ఆశ్రమ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో అక్రమాలన్నీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.250 మంది విద్యార్థులకు గాను 348 మంది విద్యార్థులు హాజరైనట్లు నమోదు చేశారు. 98 మంది విద్యార్థులు హాజరు కాకపోయినా హాజరైనట్లు నమోదు చేశారు. బియ్యం బుక్ బ్యాలెన్స్ 41.60 కింటాళ్లు ఉండాల్సి ఉండగా స్టాక్ రూమ్ లో ఫిజికల్ బ్యాలెన్స్ 51 కింటాళ్లు ఉన్నాయి. కంది పప్పు బుక్ బ్యాలెన్స్ 70 కేజీలు ఉండగా ఫిజికల్ బ్యాలెన్స్ 55 కేజీలు ఉన్నాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ బుక్ బ్యాలెన్స్ 64 ప్యాకెట్లు చూపగా స్టోర్ లో 116 ప్యాకెట్లు ఉన్నాయి. శనగ పప్పు బుక్ బ్యాలెన్స్ 34 కిలోలు గా పేర్కొనగా ఫిజికల్ బ్యాలెన్స్ 25 కిలోలు నిల్వ ఉన్నాయి. కోడి గుడ్లు బుక్ బ్యాలెన్స్ 630 చూపగా స్టోర్ లో 40 గుడ్లు మాత్రమే ఉన్నాయి. చింత పండు బుక్ బ్యాలెన్స్ 42 కేజీలు రాయగా స్టోర్ లో ఫిజికల్ బ్యాలెన్స్ 60కేజీలు ఉంది.
అన్ని వస్తువుల్లో స్టాక్ రిజిస్టర్ కు స్టోర్ ఫిజికల్ బ్యాలెన్స్ కు భారీ వ్యత్యాసాన్ని గమనించిన డిప్యూటీ డైరెక్టర్ అవాక్కైనట్లు సమాచారం. మెనూ ఏమాత్రం పాటించడం లేదని విద్యార్థులు కూడా వాపోయారు. డిడి ఆకస్మిక తనిఖీలో ఆశ్రమ పాఠశాలలోని మెనూ సంబంధించిన విషయాలే కాకుండా విద్యా బోధనకు సంబంధించిన విషయాలు కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి. పాఠశాల హెడ్మాస్టర్ స్థానికంగా ఉండకపోవడం, ఉపాధ్యాయులు కూడా నిబంధనల మేరకు స్టడీ అవర్లు నిర్వహించకపోవడం లాంటి అనేక అవకతవకలు వెలుగు చూశాయి.