కొత్తగూడెం క్రైం, జూన్ 1 : ఆ ఇంట్లో నాన్న, అన్నయ్యలు ఇద్దరూ జడ్జీలే. కానీ.. ఆయన మాత్రం ఐపీఎస్ కొలువును ఎంచుకున్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ఎంపికై ఐపీఎస్ అధికారి అయ్యారు. సేవే లక్ష్యంగా.. ప్రజా క్షేత్రంలో నిరంతరం పని చేయడమే ధ్యేయంగా పెట్టుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రొబేషనరీ పూర్తి చేసుకోబోతున్న ఐపీఎస్ అధికారి విక్రాంత్‌కుమార్ సింగ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజీయాబాద్‌కు చెందిన విక్రాంత్‌కుమార్ సింగ్ 2022లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన తండ్రి మహేందర్ సింగ్ జిల్లా జడ్జిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. తల్లి మంజులా సింగ్ గృహిణి. విక్రాంత్‌కుమార్ సింగ్ సోదరుడు ప్రశాంత్ సింగ్ బనారస్ సివిల్ జడ్జి(ఎస్డీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు.
బీటెక్ పూర్తి కాగానే 2015లో విక్రాంత్ సింగ్ ఎస్బీఐ పీవోగా ఎంపికయ్యారు. 2016 నుంచి రెండుసార్లు సివిల్స్‌కి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 2019 నుంచి 2021 వరకు ఐసీఏఎస్, ఐఏఏఎస్లో ఎంపికయ్యాక కూడా పట్టు విడువకుండా మూడోసారి ప్రయత్నించి 2022లో సివిల్స్ రాసి యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత ఈ ఏడాది జనవరి 8న ప్రొబేషనరీ విధులు నిర్వర్తించేందుకు జిల్లాకు వచ్చారు. అప్పటి నుంచి మార్చి 3వ తేదీ వరకు కలెక్టర్ అటాచ్మెంట్లో వివిధ హోదాల్లో పోలీస్‌గా విధులు నిర్వర్తించారు. మార్చి 4 నుంచి మే 25వ తేదీ వరకు విక్రాంత్‌కుమార్ సింగ్ లక్ష్మీదేవిపల్లి ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఏఎస్పీ విధుల్లో ప్రొబేషనరీ కాలపరిమితి పూర్తి చేసుకుని ఈ నెలలో మళ్లీ జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లి శిక్షణ పూర్తి చేసుకుని వచ్చి అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రజాసేవ చేయాలనే సంకల్పం నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నేను ఐపీఎస్కి ఎంపికయ్యాక నేరుగా ప్రజల్లోనే ఉంటూ విధులు నిర్వర్తించే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు నన్ను ఎంతగానో ప్రోత్సహించడమే కాకుండా సోదర భావంతో పని చేయించారు. నాతో విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బంది సైతం నాకు ఒక గైడ్‌లా వ్యవహరించారు. శిక్షణ పూర్తి చేసుకునేందుకు ఎంతో సహకరించారు. నా ప్రొబేషనరీ కాలపరిమితిలోనే సాధారణ ఎన్నికలు రావడం, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వర్తించడం, అందులో భాగంగానే ప్రజలతో మమేకమై పని చేయడం నాకు మంచి అనుభవాన్నిచ్చింది. పూర్తి బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ తక్కువ కాలంలో నాలో నింపుకున్న స్పూర్తితో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తా.