ఖమ్మం జనవరి 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగు పెట్టుబడి నిమిత్తం యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అందించే సాయం రూ.192 కోట్లకు చేరింది. కేవలం పదిరోజుల వ్యవధిలోనే 2,60 లక్షల మంది రైతులకు గాను రూ.192 కోట్లను సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన లక్ష మంది రైతులకు సంబంధించిన మరో రూ.165 కోట్లను సంక్రాంతి పండుగలోపు అందజేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
నేటి వరకు ఎకరంలోపు భూమి కలిగిన 1,14,000 రైతులకు రూ.34 కోట్లు, 1నుంచి 2 ఎకరాలు కలిగిన 78,500 మంది రైతులు రూ.58కోట్లు, 2నుంచి 3 ఎకరాలు కలిగిన 43,700 మంది రైతులకు రూ.55 కోట్లు, 3 నుంచి 4 ఎకరాలు కలిగిన 24,500 మంది రైతులకు రూ.45.50 కోట్లు పంపిణీ చేశారు. దీంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా సాగు పనులు జోరందుకున్నాయి. సాగుకు పెట్టుబడి అవసరం కావడంతో రైతులు బ్యాంకుల దగ్గరికి వెళ్లి ఏరోజుకారోజు నగదును విత్‌డ్రా చేసుకుంటున్నారు. అనంతరం విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారుల గణంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా యాసంగి సాగు లక్ష ఎకరాలకు చేరింది. అత్యధికంగా మక్కసాగు 75 వేల ఎకరాలకు చేరగా.. వరి రెండో ప్రధాన పంటగా సాగవుతున్నది. అయితే ఒకవైపు పంటల పెట్టుబడి సకాలంలో అందుతుండటంతో ఇదే అదునుగా భావించిన రైతాంగం వ్యవసాయం పనులను ముమ్మరం చేశారు.