కారేపల్లి, జనవరి 31 : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని లింగం బంజరలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి (శివాలయం) గుడి స్థలంపై శనివారం దేవాదాయ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ శాఖ అధికారులు విచారణ నిర్వహించారు. స్థానిక శివాలయంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి వేణుగోపాలాచార్యులు విలేకరులతో మాట్లాడుతూ.. దేవస్థానానికి 3.08 ఎకరాల స్థలం కలిగి ఉన్నట్టు రికార్డుల్లో నమోదైందని తెలిపారు. ప్రస్తుతం దేవాలయం 10 గుంటలలో మాత్రమే ఉందన్నారు. విశ్వనాథపల్లి రెవెన్యూలోని సర్వే నంబర్ 362లో గల 11.33 ఎకరాలలో దేవాలయానికి సంబంధించిన 3.08 ఎకరాల స్థలం ఉందని తెలిపారు.
రికార్డుల్లో ఉన్నట్లుగా శివాలయానికి సంబంధించిన 3.08 ఎకరాల స్థలానికి కొలతలు వేసి హద్దులు నిర్ణయించాల్సిందిగా రెవెన్యూ శాఖను కోరడం జరిగిందన్నారు. అందులో భాగంగా సర్వేయర్ వి.కిరణ్ కుమార్, స్థానిక జిపిఓ రాందాస్, లింగం బంజర గ్రామస్తులు, శివాలయ సమీప భూముల యజమానులతో కలిసి స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. శివాలయం భూమి హద్దులు గుర్తించేంత వరకు 362 సర్వే నంబర్ లోని 11.33 ఎకరాల భూమిలో ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని గ్రామ పంచాయతీ అధికారులను కోరినట్లు ఈఓ తెలిపారు.