అతడి పేరు భూక్యా హరికృష్ణ. ఇంటర్ విద్యార్థి. అతడి తండ్రి చిన్నపాటి రైతు, పేద కుంటుంబం. పంట చేతికొస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. అతడిది చండ్రుగొండ మండలం రావికంపాడు. ఆ గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకూ చదువుకున్నాడు. ఇంటర్ చదువుకుందామంటే అతడి మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదు. దీంతో పొరుగునే ఉన్న జూలూరుపాడు మండలంలోని ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీలో చేరాడు. కానీ పబ్లిక్ పరీక్షలు సమీపించే సరికి అసలు సమస్య ఎదురైంది. అదేంటంటే జూలూరుపాడులో ఇంటర్ పరీక్ష కేంద్రం లేకపోవడం.
దీంతో అతడు పరీక్షలు రాయాలంటే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రమైన కొత్తగూడెం వెళ్లాల్సిందే. అదీగాక.. జూలూరుపాడు, చండ్రుగొండ మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రమైన కొత్తగూడేనికి నేరుగా బస్సులు ఉన్నప్పటికీ.. ఆయా విద్యార్థులు తమ పల్లెల నుంచి ఆటోల్లో ప్రయాణించి మండల కేంద్రాలకు చేరుకొని, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సిన పరిస్థితి. అంతేకాదు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేని మండలాలు జూలూరుపాడు, చండ్రుగొండ మాత్రమే కాదు. భద్రాద్రి జిల్లాలో ఇలాంటి మండలాలు ఏకంగా ఏడు ఉండడం గమనార్హం. ఈ అన్ని మండలాల్లోనూ ఇంటర్ విద్యార్థులది ఇదే పరిస్థితి.
-భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)
మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. భద్రాద్రి జిల్లాలో 19,258 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం అధికారులు 36 పరీక్ష కేంద్రాను ఏర్పాటు చేశారు. అయితే, జిల్లాలో 23 మండలాలు ఉండగా.. వాటిల్లో ఏకంగా ఏడు మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు. అయితే, ఇంటర్ చదువుకునేందుకే రోజూ పదుల కిలోమీటర్ల మేర ప్రైవేటు వాహనాల్లో రాకపోకలు సాగిస్తూ తరగతులకు హాజరవుతున్న పరిస్థితుల్లో అసలు వార్షిక పరీక్షలు రాసేందుకు కూడా ఇంకొంత దూరం ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తున్నది.
ఈ దూరం ఒక్కో గ్రామం నుంచి 2030 కిలోమీటర్ల వరకూ ఉంటోంది. పైగా, పరీక్ష సమయానికంటే ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలన్న తొందరలో అత్యధికంగా ఆటో చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తున్నది. దీంతోపాటు ఇంటర్ పరీక్షా కేంద్రాలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేని మండలాల వివరాల ఇలా ఉన్నాయి. అవి, ఆళ్లపల్లి, కరకగూడెం, దమ్మపేట, సుజాతనగర్, చండ్రగొండ, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి.
ఇంటర్ విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యాన్ని కల్పించారు. కానీ అవి మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, లేదా పరీక్ష కేంద్రాల వరకు మాత్రమే ఉంటున్నాయి. కానీ ఆయా విద్యార్థులు తమ పల్లెల నుంచి మండల కేంద్రాల్లోనే అధిక చార్జీలిచ్చి మరీ ఆటోల్లోనే ప్రయాణించాల్సిన పరిస్థితి. మండల కేంద్రాల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటే ప్రయాణించాల్సిన దూరం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మా మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేకపోవడంతో ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాను. ఇక్కడ పరీక్ష కేంద్రం కూడా లేదు. కొత్తగూడెం వెళ్లి పరీక్ష రాయాలి. మా ఊరి నుంచి ఆటోలో జూలూరుపాడు వెళ్లాలి. అక్కడి నుంచి బస్సు ఎక్కి కొత్తగూడెం చేరుకోవాలి. అసలే ఓవైపు పరీక్షల టెన్షన్ ఉంది. ఇప్పుడు ప్రయాణం విషయంలో మరో టెన్షన్ మొదలైంది. పరీక్ష సమయానికి చేరుకునేలా ఆటోలు, బస్సులు ఉంటాయో ఉండవోనన్న ఆందోళన వెంటాడుతోంది.
-ధరావత్ చరణ్, ఇంటర్ సెకండియర్, బేతాలపాడు, జూలూరుపాడు
మా మండలంలో కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదు. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మా మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణించాలి. మా ఊరి నుంచి జిల్లా కేంద్రమైన కొత్తగూడేనికి చేరుకోవాలంటే ఆటోలు ఎక్కాల్సిందే. రెండు గంటల ముందుగా బయలుదేరితే తప్ప పరీక్ష సమయానికి చేరుకోలేని పరిస్థితి. పొరపాటున ఆటో లేటైనా, ఒకవేళ బస్సు అందకపోయినా పరీక్షను కోల్పోయే ప్రమాదం. పరీక్ష కేంద్రాలు దూరంగా ఉంటే ఎంతో ఇబ్బందిగా ఉంది.
-ధరావత్ వినాయక్, ఇంటర్ సెకండియర్, బాల్యాతండా, చండ్రుగొండ
మాది మర్కోడు గ్రామం. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు చదువుతున్నాను. వార్షిక పరీక్షలు రాయాలంటే గుండాల మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. అది మా ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతదూరం వెళ్లి పరీక్ష రాయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మా దగ్గర పరీక్ష కేంద్రం లేని కారణంగా ఇబ్బందులు పడుతూనే పరీక్షలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మాలాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విషమ పరీక్షలు అవుతున్నాయి.
-వేమూరి మహేంద్రకుమార్, ఒకేషనల్, మర్కోడు, ఆళ్లపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏడు మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు. గత ఏడాది జూలూరుపాడు మండలంలో ఒక పరీక్ష కేంద్రం ఉండేది. అయితే, అక్కడ ప్రైవేటు కాలేజీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. అందువల్ల అక్కడి పరీక్ష కేంద్రం క్యాన్సిల్ అయింది. కొన్ని మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేనందువల్లనే పరీక్ష కేంద్రాలు పెట్టడం లేదు. దూర ప్రాంతాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాం.
-హెచ్.వెంకటేశ్వరరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, భద్రాద్రి