ఖమ్మం, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘విద్యార్థుల ఏడాది చదువును నిర్దేశించే వార్షిక పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేశాం. ఆరోపణలకు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు (నిఘా నేత్రాలు) అమర్చాం. విద్యార్థులు ఎలాంటి ఆందోళనా పడకుండా పరీక్షలు రాసేలా పూర్తిస్థాయిలో వసతులు కల్పించాం. పర్యవేక్షకుల నుంచి నిర్వాహకుల వరకు నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేశాం.
బంగారు ఆభరణాలు, వాచీలు, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి వాటిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించం. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి కేంద్రంలోనూ మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టాం. అలాగే, ప్రతీ పరీక్ష కే్ంరద్రంలోనూ బందోబస్తు చేపట్టేలా కలెక్టర్, సీపీ చర్యలు తీసుకున్నారు’ అని ఖమ్మం జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి కే.రవిబాబు తెలిపారు. ఈ నెల 5 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల ఏర్పాట్ల గురించి ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. ఆ వివరాలన్నీ ఆయన మాటల్లోనే..
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 5 నుంచి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. బుధవారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు, గురువారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 72 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నాం. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులను గంట ముందునుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తాం.
హాల్‌టికెట్ల విషయంలో ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో వారికి సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చాం. విద్యార్థులెవరైనా తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ బోర్డు (టీజీబీఐఈ) అధికారిక వెబ్సైట్ అయిన https:// tgbie.cgg.gov.in నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకొని పరీక్ష కేంద్రాలకు వెళ్లొచ్చు. వాటిపై అధికారుల సంతకాలేమీ అవసరం లేదు.
జిల్లాలో ఏర్పాటు చేసిన 72 పరీక్ష కేంద్రాల్లో 34 ప్రభుత్వ కళాశాలల్లోనివి. 38 ప్రైవేట్ కళాశాలల్లోనివి. వీటన్నింటిలోనూ పూర్తిస్థాయిలో వసతులు ఏర్పాటుచేశాం. విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్షలు రాసే అవసరం లేకుండా బెంచీలు ఏర్పాటు చేశాం. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు, సీఎస్‌లు, డీవోలు ఫోన్లు వినియోగించకుండా నిషేధం విధించాం. హాల్‌టికెట్‌పై కంట్రోల్ రూమ్ నంబర్‌ను పొందుపర్చాం. పరీక్షకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నా, సమాచారం ఉన్నా కంట్రోల్ రూంలోని 9948904023 నంబర్‌కు తెలియజేయొచ్చు. అలాగే, 72 పరీక్ష కేంద్రాల్లో ఒక ప్రైవేట్ స్కూల్, రెండు ప్రభుత్వ స్కూళ్లు, రెండు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
ప్రశ్నపత్రాల పంపిణీ దగ్గర నుంచి మొదలుకొని విద్యార్థుల నుంచి సమాధాన పత్రాలు తీసుకునే వరకు ప్రతి అంకమూ సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరుగుతుంది. నిఘా నేత్రాల ద్వారా ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఇంటర్ బోర్డు నుంచి ప్రశ్నపత్రాల బండిళ్లు ఇప్పటికే వచ్చాయి. ఆదివారం నాటికే వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించాం. నిర్ణీత పరీక్ష జరిగే రోజు ఆయా కేంద్రాల సీఎస్‌లు, డీవోలు ఉదయం 8 గంటలకే పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవాలి.
ఉన్నతాధికారులు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నపత్రం కోడ్‌ను వెలువరించగానే సంబంధిత కస్టోడియన్లు ఆ సెట్ ప్రశ్నపత్రాన్ని ఉదయం 8:30 గంటల తర్వాత పోలీసు స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. సంబంధిత పోలీసు అధికారి పర్యవేక్షణలో ఆటోలోగానీ, కారులోగానీ సెక్యూరిటీ మధ్య ప్రశ్నపత్రాన్ని తీసుకెళ్లాలి. ఉదయం 8:45 గంటలకు విద్యార్థికి ఓఎంఆర్‌ను అందించనున్నాం. సరిగ్గా 9 గంటలకు సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్నపత్రాల బండిళ్ల సీల్ తీయనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను, పరీక్ష నిర్వహణను ఉన్నతాధికారులు వెబ్‌కాస్టింగ్ ద్వారా వీక్షిస్తారు.
ఖమ్మం జిల్లాలో మొత్తం 36,660 మంది ఇంటర్ విద్యార్థులున్నారు. వీరిలో ప్రథమ సంవత్సర పరీక్షలకు జనరల్ విభాగంలో రెగ్యులర్ విద్యార్థులు 15,579 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,204 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు జనరల్ విభాగంలో రెగ్యులర్ విద్యార్థులు 16,632 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,245 మంది ఉన్నారు. మొత్తం 131 కళాశాలలకు గాను 72 కేంద్రాలను ఏర్పాటుచేశాం. జంబ్లింగ్ పద్ధతిలో విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించాం. ప్రతీ కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉన్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచీనీటి వసతి, ప్రథమ చికిత్స వంటి ఏర్పాట్లు చేశాం. పరీక్షల పర్యవేక్షణ కోంస మూడు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను, ఐదు సిట్టింగ్ స్కాడ్ బృందాలను నియమించాం. ప్రతీ ఫ్లయింగ్ స్కాడ్ బృందంలో ఒక సీనియర్ లెక్చరర్, ఒక ఎస్ఐ, ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు. పరీక్షల నిర్వహణ హైపవర్ కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, సీపీ, ఆర్జేడీ, డీఐఈవో, ఒక ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, సబ్జెక్ట్ లెక్చరర్ సభ్యులుగా ఉంటారు. వీరంతా పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది 82 మంది విద్యార్థులు పెరిగారు. అందుకు అనుగుణంగా రెండు పరీక్ష కేంద్రాలను కూడా పెంచాం.