ఖమ్మం అర్బన్, మార్చి 21: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంగా నిర్వహిస్తున్నారు. నాలుగు విడతల్లో ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఫస్ట్ స్పెల్ ఈ నెల 22వ తేదీ నుంచి ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్ సైన్స్ పేపర్లు, సెకండ్ స్పెల్ 24వ తేదీ నుంచి ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లు, ధర్డ్ స్పెల్ 26వ తేదీ నుంచి కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లు , ఫోర్త్ స్పెల్ 28వ తేదీ నుంచి హిస్టరీ, బోటనీ, జువాలజీ పేపర్లు వాల్యుయేషన్ చేయనున్నారు. ఈ పేపర్ల కోసం చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్క్రూట్నీ నైజర్లు, సబ్జెక్ట్ ఎక్స్ఫర్ట్లు, ఏసీవోలను నియమించారు. సంస్కృతం పేపర్ ఈ నెల 10వ తేదీన ప్రారంభమైంది. ప్రక్రియను క్యాంప్ ఆఫీసర్ కె.రవిబాబు పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో జరిగే మూల్యాంకన కేంద్రానికి 2,97,766 సమాధాన పత్రాలను బోర్డు కేటాయించింది. వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన ఇతర జిల్లాల్లోని విద్యార్థుల సమాధాన పత్రాలు ఉంటాయి. శుక్రవారం నాటికి 1,83,415 సమాధాన పత్రాలు ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని క్యాంప్‌నకు చేరాయి. వీటిని మూల్యాంకనం చేసేందుకు అసిస్టెంట్ ఎగ్జామినర్లను బోర్డు నియమించింది. సంస్కృతం-29 మంది, తెలుగు-80, ఇంగ్లిష్-107, హిందీ-10, గణితం-157, సివిక్స్-48, హిస్టరీ- 25 మందిని కేటాయించారు. వీరు క్యాంప్ ఆఫీసర్‌కు రిపోర్ట్ చేయనున్నారు.