కొత్తగూడెం అర్బన్, మే 23: పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇటు వ్యాపారులు, అటు ప్రజలు ఇబ్బందులుపడకుండా ఉండేందుకు, ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు ముగింపు పలికేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే చోట వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు సమీకృత మార్కెట్లకు (Integrated Markets) శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రగతి నిధులను ప్రత్యేకంగా ఈ సమీకృత మార్కెట్లు (కూరగాయలు, చేపలు, మాంసం) నిర్మాణానికి సైతం కేటాయించింది. టెండర్లు కూడా ఖరారు చేసి వెంటనే పనులు చేసేలా చర్యలు చేపట్టింది. పనులు సైతం కొంతమేర పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నెమ్మదించాయి. ప్రస్తుతం పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
9 కోట్లతో పనులు ప్రారంభం
కొత్తగూడెం నియోజకవర్గంలో అధునాతన సమీకృత మార్కెట్లు నిర్మించి రైతులకు, చిరువ్యాపారులకు ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రైతులు వ్యాపారం చేసుకునేందుకు అనువుగా షెడ్లు, వెజ్, నాన్వెజ్, పూల వ్యాపారుల కోసం ప్రత్యేక భవన నిర్మాణం కోసం అరకొర సౌకర్యాల మధ్య వ్యాపారకార్యకలాపాలను నిర్వహించుకునే రైతులకు, ఇతర వ్యాపారులకు అన్నిరకాల వసతులను ఈ సమీకృత మార్కెట్లతో కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం, పాల్వంచ – మున్సిపాలిటీలకు చెరో రూ.4.50 కోట్లతో మొత్తం రూ.9కోట్లను కేటాయించి పనులు చేపట్టింది. గతంలో పనులు వేగవంతంగా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ గతేడాది కాలంగా పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
అధునాతన వసతులతో ఈ దుకాణాలను కేటాయిస్తే వ్యాపారం సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకుందామనుకున్న రైతులకు, చిరువ్యాపారుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లుతున్నది. కొత్తగూడెం రైతుబజార్లో నిర్మిస్తున్న మార్కెట్లో సుమారు 150 మందికి, పాల్వంచలో నిర్మిస్తున్న మార్కెట్లో సుమారు 148 మందికి షాపులను కేటాయించేలా రూపకల్పన చేశారు. కానీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం, సగంలోనే నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో చిరు వ్యాపారులు రోడ్డు పైనే వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిర్మాణ పనులు పూర్తిచేసి వ్యాపారులకు కేటాయించాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు. ఈ విషయంపై పబ్లిక్ హెల్త్ అధికారి శ్రీనివాస్ ను వివరణ కోరగా బడ్జెట్ లేకపోవడంతో పనులు ఆగిపోయాయని, ప్రస్తుతం నిధులు విడుదలకు ప్రభుత్వం అంగీకరించిందని, నిధులు విడుదలైతే వేగవంతంగా పనులు పూర్తిచేస్తామని తెలిపారు.