కూసుమంచి, జూలై 8 : బలమైన విద్యావ్యవస్థతోనే యువతకు ఉజ్వల భవిష్యత్, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దశగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో గిరిజన యూనివర్సిటీ, కరీంనగర్ తరహాలో గ్రంథాలయం, కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘరాంరెడ్డి అన్నారు. కూసుమంచిలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతోపాటు ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుతో పారిశ్రామిక ప్రాంతంగా పురోగతి సాధిస్తుందని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతం కావడంతో ఒక గిరిజన యూనివర్సిటీ, ఖమ్మంలో మరో యూనివర్సిటీ ఏర్పాటు కావాల్సి ఉందని, వాటి ప్రాధాన్యత గురించి జిల్లా మంత్రులతో చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ర్టానికి చెందిన ఎంపీలను తీసుకెళ్లి సైనిక్ స్కూల్స్ కావాలని అడిగినట్లు తెలిపారు. అయితే గత ఏడాది క్రితం సైనిక్ స్కూళ్లు తీసివేశారని, ప్రైవేట్ పరిధిలో ఏర్పాటుకు అవకాశం ఇస్తామని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో నిరుద్యోగ యువత కోసం కరీంనగర్ తరహాలో ఒక గ్రంథాలయాన్ని నిర్మిస్తామని, ఇందుకోసం త్వరలోనే కరీంనగర్ వెళ్లి గ్రంథాలయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. సమావేశంలో నాయకులు కంచర్ల చంద్రశేఖర్, భీమినేని శ్రీనివాసరెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి, రామసహాయం బాలకృష్ణారెడ్డి, మంకెన వాసు, ఎడవల్లి రాంరెడ్డి పాల్గొన్నారు.