బోనకల్లు, మార్చి 19 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ ఉమెన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టి ఎస్ డబ్ల్యు ఐ డి సి ) ఎండీ గణపతిరెడ్డి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాలకు మంజూరైన యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ స్థలాలను బుధవారం పరిశీలించారు. దీనిలో భాగంగానే బోనకల్లు మండలంలోని లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలోని గోవిందపురం(ఎల్) గ్రామంలో గల స్థలాన్ని ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక తాసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్‌ను స్కూల్ నిర్మాణ స్థలం హద్దులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటుకు 30 ఎకరాల స్థలం అనుకూలంగా ఉందని తెలిపారు. ఈ స్థలాన్ని వెంటనే చదును చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా తయారు చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ షఫీమియా, విన్సెంట్ రావు, ఆర్ఐ మైధిలి, సర్వేయర్ పాల్గొన్నారు.