ఖమ్మం రూరల్, మార్చి 22 : మంగళగూడెం గ్రామానికి చెందిన రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పొలాలను జిల్లా వ్యవసాయాధికారి, అధికారుల బృందం శనివారం పరిశీలించింది. ‘యాసంగి ఆశలు ఆవిరి’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో శనివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల వ్యవసాయాధికారి ఉమా నాగేష్, కూసుమంచి డివిజన్ వ్యవసాయాధికారి బి.సరిత, జిల్లా వ్యవసాయాధికారి దనసరి పుల్లయ్యలు క్షేత్రస్థాయిలో పంట పొలాలను నిశితంగా పరిశీలించారు.
పంట సాగు చేసిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఎవరెవరు ఎంత మొత్తం సాగు చేశారు? ప్రస్తుతం పంట పరిస్థితి ఏమిటి? నీటి లభ్యత ఎలా ఉంది? తదితర విషయాలపై ఆరా తీశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, ఊహించని విధంగా నీటి ఎద్దడి వచ్చిందని అధికారుల ఎదుట వాపోయారు. మరో వారం దాటితే పశువులకు తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందన్నారు.
వెన్నారం చెరువు నీటిని కనీసం రెండు రోజులు వాగులోకి వదిలితే బయట పడుతామని అధికారులకు వివరించారు. అనంతరం సమీపంలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం చెరువును అధికారులు సందర్శించారు. నీటి నిల్వలను పరిశీలించారు. గ్రామంలోని వరి పొలాల పరిస్థితి గురించి డీఏవో అక్కడి నుంచి ఉన్నతాధికారులకు ఫోన్లో వివరించారు. మహబూబాబాద్ జిల్లా ఇరిగేషన్ అధికారులతో కూడా డీఏవో మాట్లాడారు. ఆయన వెంట ఏఈవోతోపాటు రైతులు ఉన్నారు.