ఇందిరమ్మ ఇల్లు మాకు రాలేదంటే.. మాకు రాలేదంటూ తమ బాధను వెళ్లగక్కారు.. పైగా ఇండ్లు ఉన్నవారికే మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని ఆవేదనను వెలిబుచ్చారు. పూరిగుడిసె, రేకుల షెడ్లలో ఉంటున్నామని కొందరు.. ఇంటిస్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక కిరాయికి ఉంటున్నామని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలేదని మరికొందరు తమ గోడును వినిపించారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామపంచాయతీని సందర్శించిన ‘నమస్తే తెలంగాణ’ విలేకరుల బృందానికి నమ్మలేని నిజాలు ఎదురయ్యాయి. గ్రామంలో నిరుపేదలందరూ రోడ్డుపైకి వచ్చి మరీ తమకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, అనర్హులకే ఇల్లు మంజూరయ్యాయని విన్నవించుకున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 28 (నమస్తే తెలంగాణ)
అది లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామపంచాయతీ. అందులో మూడు గ్రామాలు మైలారం, పాతూరు, చింతవర్రి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేసేందుకు అధికారులు మైలారాన్ని పైలట్ గ్రామంగా గుర్తించారు. మారుమూల గ్రామం కావడంతో ఎలాంటి గొడవలు ఉండవనుకొని ఈ నెల 26వ తేదీన గ్రామసభ ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల జాబితాలో ఉన్న పేర్లను చదివి వినిపించడంతో సభలో గందరగోళం మొదలైంది. రెండువర్గాల వారు గొడవపడి జాబితా పేర్లను చింపివేశారు. దీంతో ఆ గ్రామంలో రెండువర్గాల వారు ఒకరి మీద ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు సైతం చేసుకున్నారు.
పైలట్‌లో ఫైటింగ్..
అది పేరుకే పైలట్ గ్రామం. అక్కడ ఇప్పుడు ఫైటింగ్‌లు జరుగుతున్నాయి. మైలారం పంచాయతీ పరిధిలో ఉన్న మూడు గ్రామాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రాకపోవడంతో గ్రామస్తులు గరం అవుతున్నారు. మంగళవారం ఆ గ్రామానికి ‘నమస్తే తెలంగాణ’ విలేకరుల బృందం వెళ్లి పరిశీలించగా.. గ్రామస్తులు నమ్మలేని నిజాలు చెబుతున్నారు. డాబాలు ఉన్నవారికి ఇళ్లు వచ్చాయని, నాయకులు చెప్పిన వారికే ఇండ్లు వచ్చాయని ఆరోపించారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు మేము కనబడతాం గానీ ఇప్పుడు కనబడమా అంటూ రోడ్డుపైకి వచ్చి మరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒకరి సమస్య కాదని, మాలాంటి వారు చాలామంది ఉన్నారని సుమారు 50 మందికి పైగా గ్రామస్తులు రోడ్డెక్కి తమ బాధను వెళ్లగక్కారు.
ఉన్నోళ్లకే ఇండ్లు..
భవనాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో చోటు దొరకడంతో పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేకుల షెడ్లలో ఉన్న తమకు ఇండ్లు రాలేదని బాధపడుతున్నారు. పాతూరు గ్రామంలో మహిళలు రోడ్డుపైకి వచ్చి మరీ విలేకరులకు తమ గోడు వినిపించారు. మాకు రాలేదంటే.. మాకు రాలేదని ఒకే బజారులో 20 మందికి పైగా వచ్చి వారి బాధను చెప్పుకున్నారు.
అరుగు మీదనే ఉంటున్న..
నాకు ఇల్లు లేదు. పరాయి వాళ్ల అరుగు మీద తల దాచుకుంటున్నా. భర్త లేడు. బడిలో పిల్లలకు అన్నం వండి పెడుతున్న. నేను ఈ సార్లకు కనబడలేదా. ఇంత దారుణమా సారూ. నాలాంటి పేదోళ్ల కడుపు కొడితే ఎట్టా సారూ. ఇల్లు వస్తదని అంటే సంబరపడ్డ.. ఇప్పుడు ఇల్లు రాలే ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– మల్లెబోయిన స్వరూప, ఒంటరి మహిళ, మైలారం పంచాయతీ
కాంగ్రెస్ మోసం చేసింది..
మా ఇల్లు చూస్తే ఇంట్లోకి ఎవరూ రారు. అప్పుడు ఇల్లు కాలిపోయింది. అధికారులు రాసుకుని పోయారు. ఇప్పుడన్నా ఇందిరమ్మ ఇల్లు వస్తది అనుకున్న. గ్రామసభకు పోతే నీ పేరు రాలేదన్నరు. అందరూ అక్కడ పెద్దోళ్లే ఉన్నరు. అడగలేక ఇంటికి వచ్చేశా. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను మోసం చేసింది.
– పాపమ్మ, పాతూరు, మైలారం పంచాయతీ
మైలారం పంచాయతీ వివరాలు
మండలం: లక్ష్మీదేవిపల్లి
పంచాయతీ: మైలారం,
గ్రామాలు: మైలారం, పాతూరు, చింతవర్రి
జనాభా: 1,600
ఇళ్లు: 460
కుటుంబాలు: 480
మంజూరైన పథకాలు
ఇందిరమ్మ ఇండ్లు: 255
రేషన్‌కార్డులు: 65
ఆత్మీయ భరోసా: 43
రైతుభరోసా: 154