మధిర, ఆగస్టు 05 : కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొండూరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వ్యవసాయ కార్మికుల సమస్యలపై సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు, మండల కార్యదర్శి ఊట్ల కొండలరావుతో కలిసి మధిర డిప్యూటీ తాసీల్దార్ డేవిడ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతు లేకుండా వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలన్నారు.
సంవత్సరానికి రూ. 12 వేలు వెంటనే అమలు చేయాలని, ఉపాధి హామీ ఎన్.ఆర్.ఇ.జీ.ఎస్ లో పనిచేసిన వారే అర్హులనే నిబంధనలను ఉపసంహరించు కోవాలన్నారు. అలాగే వ్యవసాయ కార్మికులకు 50 సంవత్సరాలు దాటితే రూ.6 వేలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నారు. సహజ, అసహజ ప్రమాదాలకు గురై మరణించిన వ్యవసాయ కార్మిక కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించే విధంగా బీమా పథకం ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి రామాంజనం, తలారి రమేశ్, జల్లా బ్రహ్మం, అన్నవరపు సత్యనారాయణ, పున్నవల్లి అప్పారావు, నరసింహారావు పాల్గొన్నారు.