భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : దేశంలో అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన గొప్పతనమేనని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని భద్రాద్రి కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లోని మన రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే నేడు అందరూ ఫలాలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరాం, సీపీవో సంజీవరావు, బీసీ సంక్షేమాధికారి ఇందిర, వివిధ శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.