అశ్వారావుపేట, నవంబర్ 1: అక్టోబర్ నెలకు సంబంధించి ఆయిల్‌పాం గెలల ధర మరో రూ.2 వేలు పెరిగింది. సెప్టెంబర్ నెలలో టన్ను ఆయిల్‌పాం గెలల ధర రూ.17,043 ఉండగా.. అక్టోబర్ నెలకు రూ.2,101 పెరిగి.. రూ.19,144లకు చేరింది. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో కొత్త ధర ప్రకటించారు.
ఆగస్టు నెలలో టన్ను గెల ధర రూ.14,392 ఉండగా.. నూనె దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకం విధించింది. దీంతో ఆయిల్‌పాం గెలల ధర పెరిగింది. సెప్టెంబర్ నెలకు రూ.2,651, అక్టోబర్ నెలలో మరో రూ.2,101 చొప్పున గెలల ధర పెరగడంతో ఆయిల్‌పాం రైతులు ఆనందపడుతున్నారు. ప్రస్తుతం గెలల సేకరణ సీజన్లో ధర పెరగడం సాగు రైతులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నది. పెరిగిన ధర అక్టోబర్ నెలలో ఫ్యాక్టరీకి తరలించిన గెలలకు మాత్రమే వర్తిస్తుందని ఆయిల్‌ఫెడ్ డివిజనల్ మేనేజర్ ఆకుల బాలకృష్ణ తెలిపారు.