భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం/ రామవరం, జనవరి 5: పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత అమాంతం పెరిగింది. ఉమ్మడి జిల్లా ప్రజలను గజగజా వణికిస్తోంది. దీంతో ఉదయాన్నే స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, విధులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు రాత్రివేళల్లో వణికి పోతున్నారు. ఇక సాధారణ ప్రజలు కూడా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
రానున్న మూడు రోజులపాటు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత్రలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అదీగాక గడిచిన పది, పదిహేను రోజులుగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట కూడా వాతావరణ చల్లగా ఉంటోంది. ఉదయం 8 గంటల వరకూ మంచు కురుస్తోంది. సాయంత్రం ఆరు దాటాక ఇళ్లలోని జనాలు బయటకు రావడం లేదు.
నిత్యం జనం సంచారంతో, వాహనాల రాకపోకలతో రద్దీగా కనిపించే రోడ్లు కూడా చీకటి పడగానే ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే, వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పడిపోయిన ఉష్ణోగ్రతలు. వాతావరణ మార్పుల కారణంగా మునుపెన్నడూ లేనంతగా ఈ సంవత్సరం పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ప్రధానంగా గడిచిన పక్షం రోజులుగా 12 నుంచి 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లా కామేపల్లిలో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 20 రోజుల క్రితం భద్రాద్రి జిల్లాలో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. దీంతో అవకాశమున్న వాళ్లు చలిమంటలు వేసుకుంటున్నారు. చలిని తాళలేని వారికి దగ్గు, జలుబు కూడా వస్తున్నాయి.
చలి తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. చల్లగాలులు బాగా వీస్తున్నాయి. ఇలా ఎక్కువగా చలి ఉంటున్నప్పుడు పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతీ అరగంటకు వేడినీళ్లు తాగించాలి. చలికోట్లు ధరిస్తూ శరీరం వేడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహార పానీయాలు కూడా వేడిగా ఉండేలా చూసుకోవాలి. చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా బయటి ఆహారం తీసుకోవద్దు. జలుబుతో బాధపడుతున్న వారు ఆవిరి పట్టుకోవాలి. చలిగాలులు వీస్తున్న సమయంలో బయట తిరగవద్దు. -డాక్టర్ పుష్పలత, ఎండీ జనరల్ మెడిసిన్