అశ్వారావుపేట, డిసెంబర్ 1: శీతాకాలం మొదలైన వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకూ పగటి వేళ ఎండలు దంచి కొట్టగా.. ఇప్పుడు రాత్రి వేళ చలి తీవ్రత అమాంతం పెరిగింది. దీనికి ఇటీవలి ఫెంగల్ తుపాను తోడైంది. అయితే శీతాకాలం తొలినాళ్లలోనే చలి తీవ్రత ఒక్కసారిగా పెరడంతో దాని ప్రభావం చిన్నారులు, వృద్ధులపై పడుతోంది. దీంతో వారు జలుబు, దగ్గు, జ్వరం భారిన పడుతున్నారు. మధ్య వయస్కులకు కూడా సుస్తీ చేస్తుండడంతో శీతాకాలం వ్యాధుల భయం మొదలైన సంకేతాలనిస్తున్నాయి.
ఆసుపత్రులకు రోగుల సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. చలి తీవ్రత పెరగడంతో శ్వాస సంబంధిత సమస్యలతో అధిక మంది రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. అయితే ఈ కాలంలో చిన్నారుల్లో ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నమై న్యుమోనియా లక్షణాలు కన్పిస్తున్నాయంటూ వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ తగ్గడం వంటి లక్షణాలున్న రోగులు అధికంగా వస్తున్నట్లు వివరిస్తున్నారు. చలి తీవ్రతను తాళలేని చిన్న పిల్లలు, వృద్ధులపై ఇలాంటి వ్యాధుల ప్రభావం అధికంగా ఉందని వారు చెబుతున్నారు. అయితే ఇలాంటి సీజన్లో ఆరోగ్య జాగ్రత్తలు తప్పక పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లాలో చల్లటి వాతావరణం పెరగడంతో సంబంధిత వ్యాధులు విజృంభిస్తున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల నమోదును పరిశీలిస్తే తీవ్రత అర్థమవుతోంది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది గడిచిన నెలల్లో రోగుల సంఖ్య రెండింతలు పెరిగింది. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలోనే అక్టోబర్లో జ్వర పీడితుల సంఖ్య 131 మంది కాగా నవంబర్లో మందికి పైగా దాటిపోయారు. అలాగే దగ్గుతో అక్టోబర్ నెలలో 315 మంది, నవంబర్లో 465 మంది, బలుబుతో అక్టోబర్లో 210 మంది నవంబర్లో 165 మంది రోగులు నమోదయ్యారు.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల నుంచి రక్షణ కోసం ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. చలి ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకూడదు. చిన్నారులు, వృద్ధుల్లో శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధారణ జలుబు, జ్వరం అంటూ సొంత వైద్యం చేసుకోకూడదు. చల్లటి గాలి ముక్కులోకి వెళ్లకుండా మాస్కులు ధరిస్తే మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.
-కే.రాధా రుక్మిణి, ఆసుపత్రి సూపరింటెండెంట్, అశ్వారావుపేట