సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 24: సత్తుపల్లి ప్రాంతంలో కొందరు వ్యాపారుల మట్టి తోలకాల దందా మూడు పూవులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. అక్రమార్కులంతా సిండికేట్‌గా, మాఫియాగా ఏర్పడి మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌శాఖ అధికారులు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారులు రెండు సిండికేట్లుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేస్తుండడంతో పోలీసులు హడావుడిగా వెళ్లి దాడుల చేస్తున్నారు. అక్రమంగా మ ట్టి రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి వాటిని రెవెన్యూశాఖ అప్పగిస్తున్నారు. రెవెన్యూశాఖ అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో వాహనాలను విడిచిపెడుతున్నారు.
అధికారుల కనుసన్నల్లోనే..
పట్టణంలో ఒక ఇల్లు కట్టాలన్నా, స్థలం చదును చేయించుకోవాలన్నా మట్టి అత్యవసరమైంది. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు సరైన ధ్రువపత్రాలు లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్లను సమకూర్చుకుని, అధికారుల చేతులు తడిపి మట్టి తోలకాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి వేసి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారంటున్నారు. వారు రేజర్ల, కొత్తూరు నుంచి భారీ స్థాయిలో మట్టి రవాణా చేస్తున్నట్లు తెలుస్తున్నది. ట్రాక్టర్ మట్టికి రూ.600, టిప్పర్‌కు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారని, రాజకీయ నాయకులు తమకూ భాగస్వామ్యం కావాలని ఒత్తిడి చేస్తుండడంతో అక్రమార్కులు ట్రాక్టర్ మట్టికి రూ.వెయ్యి, టిప్పర్‌కు రూ.3 వేల దాకా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగమంతా జరుగుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
రాజకీయ నేతలకూ భాగస్వామ్యం..
పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు దాడులు తరచూ దాడులు నిర్వహించి వాహనాలతోపాటు మట్టిని సీజ్ చేస్తున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో కేసులను ఎత్తివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే కోవలో ఇటీవల పోలీసులు రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకుని రెవెన్యూశాఖకు అప్పగించినప్పటికీ ఆ శాఖ ఓ రాజకీయ నేత ఒత్తిడితో పోలీసులు కేసులు ఎత్తివేసినట్లు సమాచారం. అలాగే జిల్లా మైనింగ్‌శాఖ అధికారులు సత్తుపల్లి ప్రాంతంలో దాడులు నిర్వహించారు. మూడు టిప్పర్లను స్వాధీన పరచుకున్నారు. వాటిని ఆర్టీసీ డిపోలో ఉంచారు. కానీ అసలు టిప్పర్లలో మట్టిని నింపిన యంత్రాలను విడిచిపెట్టడం గమనార్హం.
మితిమీరిన వేగం..
ఇసుకను తరలిస్తున్న డ్రైవర్లు వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణాకు కాలం చెల్లిన వాహనాలు ఉపయోగిస్తున్నారని, కొందరు లైసెన్స్ లేకుండానే వాహనాలు నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. రవాణాను కట్టడి చేయాల్సిన అధికారులే చోద్యం చూస్తున్నారని, ఇప్పటికైనా అక్రమార్కులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు ఏమన్నారంటే..
మట్టితోలకాలపై సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావును ‘నమస్తే’ వివరణ కోరగా మట్టి తోలకాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నప్పటికీ సిబ్బంది కొరతతో దాడులు చేయలేకపోతున్నామని సమాధానమిచ్చారు. మైనింగ్‌శాఖ అధికారులను వివరణ కోరేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు. అలాగే సత్తుపల్లి సీఐ కిరణ్‌ను వివరణ కోరగా.. పోలీస్ సిబ్బంది అనేక సార్లు దాడులు చేసి కొన్ని టిప్పర్లను స్వాధీనం చేశామని, అనంతరం వాటిని రెవెన్యూశాఖకు అప్పగించామని సమాధానమిచ్చారు.