ఖమ్మం, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలోని ఉపాధ్యాయులకు ఈ నెల 13 నుంచి మూడు దశల్లో వృత్యంతర శిక్షణను ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని హార్వెస్ట్ పాఠశాలలో దీనిని ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన షెడ్యూల్ను కూడా రూపొందించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సామినేని సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్పీలు, సెక్టోరియల్ అధికారులకు ఈ నెల 12న సంసిద్ధతా సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ శిక్షణ కోసం ఏ ఒక్కరికీ మినహయింపు లేదని డీఈవో స్పష్టం చేశారు. మే 13 నుంచి 17 వరకు మొదటి దశ, మే 20 నుంచి 24 వరకు రెండో దశ, మే 27 నుంచి మే 31 వరకు మూడో దశ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఎస్ఏ (ఆంగ్లం) విభాగంలో 326 మంది, ఎస్ఏ (గణితం) విభాగంలో 453 మంది, ఎస్ఏ (సోషల్) విభాగంలో 436 మంది, ఎంఆర్పీలు 168 మంది, ప్రత్యేక విద్య విభాగంలో 62 మంది హాజరుకానున్నట్లు వివరించారు. కొత్తగా ఆన్లైన్లోనే జియోట్యాంగింగ్ ఆధారిత హాజరును ఉపాధ్యాయుల నుంచి తీసుకుంటున్నామని, ఐదు రోజుల శిక్షణ అనంతరం ఆన్లైన్లోనే హాజరు సర్టిఫికెట్ వస్తుందని డీఈవో సత్యనారాయణ పేర్కొన్నారు.
ఉపాధ్యాయ సంఘాల భిన్నాభిప్రాయాలు..
నిండు వేసవిలో శిక్షణ ఏర్పాటు చేయడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. శిక్షణకు హాజరయ్యే విధానంలో కొంతమేర మినహాయింపులు ఇవ్వాల్సిందేనని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వేసవి దృష్ట్యా ఒక్కపూటే శిక్షణ పూర్తి చేయాలని డీఈవో సత్యనారాయణకు మరో సంఘం నాయకులు వినతిపత్రాలు అందించారు. మండు వేసవి కావడంతో శిక్షణకు పూర్తిస్థాయిలో హాజరు ఎలా ఉంటుందోనన్న అంశంపై విద్యాశాఖ అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు.
అయితే, గత విద్యాసంవత్సరమంతా విద్యాబోధన చేసిన తాము.. తమ ఆరోగ్య పరీక్షలు, చికిత్సల కోసం వైద్యుల వద్ద ఇప్పటికే అపాయింట్మెంట్లు తీసుకున్నామని కొందరు ఉపాధ్యాయలు అంటున్నారు. తాము సుదూర ప్రాంతాల్లో ఉన్నామని మరికొందరు ఉపాధ్యాయులు చెప్పారు. ఇలాంటి తరుణంలో తమకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయితే, ఇలాంటి కారణాల వల్ల మొదటి విడతలో హాజరుకాని ఉపాధ్యాయులకు రెండో దశలోగానీ, లేదంటే మూడో దశలగానీ శిక్షణకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మాతృసంస్థకు అకడమిక్ మానిటరింగ్ అధికారి..
ఖమ్మం జిల్లా ఏఎంవోగా, సమగ్రశిక్షలో సెక్టోరియల్ అధికారిగా ఇన్నాళ్లూ పనిచేసిన రవికుమార్.. ఇకపై తాను సేవలందించలేనంటూ విద్యాశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే, జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలకు అతడు పీజీహెచ్ఎంగా వెళ్తున్నట్లు సమాచారం. దీనిపై రాష్ట్రస్థాయి అధికారులు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వేసవి శిక్షణ కార్యక్రమానికి ముందే ఏఎంవోగా రవికుమార్ తన బాధ్యతలను విరమించుకోవడం గమనార్హం. ఏఎంవోగా మరో సెక్టోరియల్ అధికారికి అదనపు బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం. అయితే, వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ఏర్పాటుచేయడం, మండు వేపవిలో శిక్షణ వద్దంటూ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం చెబుతుండడం, ఇదే సమయంలో ఏఎంవో రిలీవ్ కావడం వంటి అంశాలు విద్యాశాఖకు పెను సవాలుగా మారుతున్నాయి.