భద్రాచలం, అక్టోబర్ 3 : శ్రీదేవీ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులపాటు నిత్య పూజలు అందుకున్న దుర్గాదేవి అమ్మవార్ల నిమజ్జన కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తమండళ్లు అమ్మవార్ల ప్రతిమలను లారీలు, ఇతర వాహనాల ద్వారా భద్రాచలం గోదావరి తీరం వద్దకు ఉదయం నుంచే తరలించారు. అయితే నిమజ్జన ఘాట్ వద్ద అధికారులు ఎవరూ ఏర్పాట్లు చేయకపోవడం.. భక్తమండళ్లు సమాచారం ఇచ్చినా అధికారులు కనీసం స్పందించలేదు. దీంతో ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో మధ్యాహ్నం వరకు నీటిపారుదల, గ్రామపంచాయతీ అధికారులు నిమజ్జన ప్రాంతానికి చేరుకున్నారు.
గజ ఈతగాళ్ల సాయంతో అమ్మవార్ల ప్రతిమలను లాంచీల్లోకి ఎక్కించారు. సుమారు 20 పెద్ద విగ్రహాలను లాంచీలపైకి తరలించేందుకు క్రేన్ కావాల్సి ఉండగా.. అందుబాటులో లేకపోవడంతో విగ్రహాలను ఒడ్డున పెట్టారు. ఖమ్మం, మహబూబాబాద్, ఇల్లెందు, చర్ల, భద్రాచలం ప్రాంతాలకు చెందిన విగ్రహాలను తీసుకొచ్చారు. శని, ఆదివారాలు సైతం గోదావరిలో నిమజ్జనం కొనసాగనున్నది. వచ్చిన విగ్రహాలను వచ్చినట్లుగా లాంచీల్లోకి ఎక్కించి నదిలో దూరంగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు.