ఆంధ్రా నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. మధిర నియోజకవర్గంలో ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. మధిర, వైరా, బోనకల్లు ప్రధాన రహదారులపై పోలీస్ చెక్‌పోస్టులు ఉన్నాయి.. అయితే అక్రమార్కులు దొడ్డిదారుల్లో దర్జాగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నప్పటికీ అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నది. ఇసుక అక్రమ రవాణాపై ఉకుపాదం మోపాలని స్థానిక పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు సీపీ సునీల్‌దత్ ఇటీవల సమావేశం నిర్వహించి ఆదేశించారు. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సీపీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.
– మధిర, ఏప్రిల్ 24
పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల కళ్ళు కప్పి అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అండదండలతోనే ఇసుక రవాణా జరుగుతున్నదని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మధిర ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార మహిళా సంఘాలకు ఆదాయం సమకూర్చడం కోసం ఇసుక రీచ్‌లను అప్పగించారు. కానీ అటు మహిళా సంఘాలు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా అక్రమార్కులు ఇసుకను ఆంధ్రా ప్రాంతం నుంచి తెలంగాణకు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు.
ఇసుక రవాణాను అరికట్టేందుకు బోనకల్లు, మధిర, ముదిగొండ మండలాల్లో ప్రధాన రహదారులపై ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కానీ అక్రమారులు మాత్రం వేరే రోడ్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన వ్యక్తుల ట్రాక్టర్లను పట్టుకున్నా వెంటనే వదిలేస్తున్నారని, ఇతర పార్టీలకు చెందిన తమ ట్రాక్టర్లపై మాత్రం కేసులు నమోదు చేస్తున్నారని పలువురు యజమానులు ఆరోపిస్తున్నారు.
మధిర మండలంలోని నకలగరువు సమీపంలో గల మున్నేరు నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రభుత్వ పనుల పేరుతో అనుమతులు తీసుకొని ఇసుకను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక కూపన్ తీసుకొని రెండు, మూడు ట్రాక్టర్లు అదే కూపన్‌పై తరలిస్తున్నారు. బోనకల్లు మండలంలో వైరా మున్నేరు నుంచి, చింతకాని మండలంలో ఖమ్మం నుంచి లింగాల మధ్యగల మున్నేరు నుంచి, ముదిగొండ మండలంలో వల్లభి పెద్దమండవ సమీపంలో గల మున్నేరు నుంచి యథేచ్ఛగా రాత్రివేళలో ఖమ్మం నగరం, ఇతర ప్రాంతాలకు సైతం ఇసుక రవాణా జరుగుతున్నది.
దీనికితోడు ఆంధ్రా సమీపంలో గల బోనకల్లు మండలానికి ఇసుక రవాణా కోసం లింగాల మున్నేరు నుంచి వత్సవాయి వేములనర్వ, గోవిందాపురం(ఏ), చొప్పకట్లపాలెం గ్రామాల మీదుగా రహస్య రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. కాలువ కట్ట, రైతులు ఏర్పాటు చేసుకున్న రోడ్లు, రైతుల పొలాల్లో నుంచి ఇసుక ట్రాక్టర్లు రాత్రివేళలో తిరుగుతున్నాయని, దీంతో తమ పొలాలు పాడైపోతున్నాయని రైతులు వాపోతున్నారు. భారీ లోడుతో ఇసుక ట్రాక్టర్లు వెళ్తుండడంతో రోడ్లన్నీ పెద్ద పెద్ద గుంతలు పడి ధ్వంసమవుతున్నాయని చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళల్లో ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా కొంతమంది వ్యక్తులు రవాణా చేస్తున్నారు. వత్సవాయి నుంచి బీబీసీ కెనాల్ మీదుగా బోనకల్లు చెరువుకట్ట వరకు ట్రాక్టర్లు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి. రైతులం ఏర్పాటు చేసుకున్న రోడ్డులో అధికలోడుతో ఇసుక ట్రాక్టర్లు తిరగడం వల్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడి నడవడానికి కూడా వీలులేకుండా తయారైంది. రోడ్డుపై ట్రాక్టర్ దిగబడడంతో నా వరిపొలంలో నుంచి ట్రాక్టర్లు నడిపి ఆగమాగం చేశారు. పొలాన్ని నాశనం చేసిన వ్యక్తులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాను. అయినా ఫలితం లేదు.
– మందా రామారావు, రైతు, బోనకల్లు