బూర్గంపహాడ్, నవంబర్ 17: బూర్గంపహాడ్ మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. అక్రమార్కులందరూ మాఫియాగా ఏర్పడి రాత్రీ పగలూ తేడా లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తొలుత బెదిరింపులకు దిగుతున్నారు. ఆపై దాడులకు పాల్పడుతున్నారు. చివరికి అడ్డుకోబోయిన అధికారులపై కూడా దాడులు తెగబడే పరిస్థితికి వచ్చారు. ఇటీవల ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధిని కూడా ఇసుక మాఫియా వ్యక్తులు ఇటీవల దూషించిన విషయం విదితమే. దీంతో అతడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో తహసీల్దార్ తమ సిబ్బందితో వెళ్లి ఇసుక రవాణా జరుగుతున్న ప్రాంతాల్లో కందకాలు తీయించారు. అయినా ఇసుక మాఫియా కొత్త మార్గాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉంది.
అక్రమ రవాణాపై అధికారులకు సమాచారం ఇచ్చినవారిపైనా ఇసుక మాఫియా బెదిరింపులు, దాడులకు దిగడం పరిపాటిగా మారింది. ఇసుక రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖలు కలిసి పనిచేయాల్సి ఉంది. అయితే ఈ శాఖల మధ్య ఉన్న సమన్వయలోపం కారణంగా ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతోంది. తాజాగా సారపాక బ్రిడ్జి కింద ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులు వెళ్లారు. వారు ఘటనా ప్రదేశానికి చేరుకోగా గుంపుగా ఉన్న వారందరూ పారిపోయారు. అందులో ఓ వ్యక్తి ఆర్ఐ కాళ్లను లాగడంతో ఆయన కిందపడిపోయాడు. ఆర్ఐ కాలికి గాయమైంది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించినా వారు సకాలంలో రాలేదనే వాదనలు ఉన్నాయి. దీంతో 100కు కాల్చేసి సమాచారం అందించినట్లు చెబుతుండడం గమనార్హం. అయితే, రెవెన్యూ అధికారులే తమకు సమాచారం ఇవ్వకుండా వెళ్తున్నారని పోలీసులు అంటుండడం ఆ రెండు శాఖల మధ్య సమన్వయలోపాన్ని తెలియజేస్తోంది.
సారపాకలో బ్రిడ్జి కింద శనివారం అర్ధరాత్రి సమయంలో ఇసుక రవాణా జోరుగా జరుగుతోందన్న సమాచారం రెవెన్యూ అధికారులకు అందింది. వారు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ ఆదేశాల మేరకు డీటీ రాంనరేశ్, ఆర్ఐ-1 ముత్తయ్య, రెవెన్యూ సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. భాస్కర్నగర్, గాంధీనగర్లకు చెందిన ఇసుక మాఫియా సభ్యులు అప్పటికే అక్కడ ఉన్నారు. రెవెన్యూ అధికారులు వెళ్లగానే ఆ ఇసుక మాఫియా సభ్యులు కర్రలతో ఆర్ఐపై దాడికి యత్నించారు. వారిని పట్టుకుంటున్న క్రమంలో ఆర్ఐ కాళ్లను ఇసుక మాఫియా సభ్యులు లాగారు. దీంతో ఆయన కింద పడడంతో అతడి కాలికి గాయమైంది. మిగతా అధికారులు అక్కడే ఉన్న ఓ వ్యక్తిని పట్టుకొని వివరాలు సేకరించారు. ఓ ట్రాక్టర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడికి ఉపయోగించిన కర్రలను, ఇసుక రవాణాకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.