ఖమ్మం, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వైరా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన మూకుమ్మడి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం రిజిస్ట్రేషన్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఒకే వెంచర్‌కు సంబంధించి 64 రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు 50 వేల గజాల స్థిరాస్తిని నిబంధనలు తుంగలోకి తొక్కి రిజిస్ట్రేషన్ చేసిన తీరు శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో రావడంతో ఈ వ్యవహారంపై అధికారులు పూర్తిస్థాయి దృష్టి సారించారు.
వైరాలో జరిగిన మూకుమ్మడి రిజిస్ట్రేషన్లలో నిబంధనలు పాటించని వ్యవహారం తన దృష్టికి సైతం వచ్చిందని, దీనిపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలను సహించేది లేదని, రాష్ట్రస్థాయిలో ప్రక్షాళన జరుపుతామని వెల్లడించారు. ఇక వైరా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకోనున్నట్లు తెలుస్తున్నది.
లే అవుట్, ఎల్ఆర్ఎస్ నిబంధనలను పక్కకు పెట్టి కొన్నింటికి మాత్రమే లే అవుట్, ఎల్ఆర్ఎస్లు ఉన్నా అన్ని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు తప్పుబట్టినట్లు తెలుస్తున్నది. జీపీఏ ఉన్న వ్యక్తికి ఏ సంబంధం లేకుండా, జీపీఏ రద్దు కాకుండా అర్ధరాత్రి వరకు మూకుమ్మడి రిజిస్ట్రేషన్లు చేయాల్సిన అవసరం ఏమిటని వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్యపై రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ బుద్ధప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు వైరా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉన్నతాధికారులతో విచారణ కమిటీని నియమించారు. వరుసగా సెలవులు రావడంతో పండుగ అనంతరం విచారణ కమిటీ వైరా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్ట్రేషన్ల వ్యవహారం, నిబంధనలను తుంగలోకి తొక్కిన తీరును పరిశీలించనుంది.
ఇక ఉన్నతాధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఒకే వెంచర్‌కు సంబంధించి 64 రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు 50 వేల గజాల స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేయడం అధికారులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. ఈ భూమిపై జీపీఏ కలిగిన వ్యక్తి రాష్ట్ర రెవెన్యూ మంత్రికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. రిజిస్ట్రేషన్లను అర్ధరాత్రి 2 గంటల వరకు చేయాల్సిన అవసరం ఏమిటంటూ ప్రశ్నించిన రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులను చేస్తూ వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్యపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తున్నది.
ఈ మేరకు ఉన్నతాధికారుల నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే వరుసగా సెలవులు రావడంతో రామచంద్రయ్యకు అధికారికంగా సస్పెన్షన్ ఉత్తర్వులు అందాల్సి ఉంది. ఇక రిజిస్ట్రార్ కార్యాలయాలను రిజిస్ట్రేషన్లు నిబంధనలకు అనుగుణంగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాల్సిన జిల్లా రిజిస్ట్రార్ నిర్లక్ష్యంగా వ్యవహరించి, సమన్వయం చేసుకోలేకపోయారని, ఈ మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు సకాలంలో నివేదించలేదన్న కారణంతో ఆయనపై సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జిల్లా రిజిస్ట్రార్‌పై బదిలీ వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. మూకుమ్మడి రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రచార సాధనాల ద్వారా వెలుగులోకి రావడంతో జీపీఏకి చెందిన వ్యక్తికి సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు ఈ వ్యవహారాన్ని సద్దుమణిచేందుకు అధికార పార్టీ నేతల ద్వారా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ 64 రిజిస్ట్రేషన్లలో 10 ప్లాట్లకు సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం, దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై సంబంధిత అధికారులను రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు మందలించినట్లు తెలుస్తున్నది.