కళ్లు తెరవకుండానే మీ పొత్తిళ్ల వెచ్చదనానికి దూరమవుతున్న మేము.. ‘ఏం పాపం చేశాం అమ్మా?’ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా కన్పిస్తున్నాయి అభంశుభం తెలియని పసిగుడ్ల మోములు. తల్లెవరో? తండ్రెవరో అనే ఊహ తెలియకుండానే వారు మరో తల్లి ఒడికి చేరుతుండడం ప్రతి ఒక్కరికీ అంతులేని ఆవేదనను కలిగిస్తోంది. కడు పేదరికం, అధిక సంతానం, ఆడబిడ్డలు కావడం వల్ల భారం వంటివి కారణాలుగా భావించి కన్నతల్లులు ఇలాంటి పాపాలను మూటకట్టుకుంటున్నారని సంబంధిత అధికారులు చెబుతుండడం కలిచివేసే అంశం. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడాదిలో పది మందికి పైగా అక్రమ దత్తత పేరుతో తల్లి ఒడిని వీడి చివరికి శిశుగృహకు చేరడం అత్యంత విషాదకరమైన విషయం. బాల్యానికి భరోసా ఇవ్వాల్సిన పాలకులు చోద్యం చూస్తుండడంతో అక్రమ దత్తతలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సంతానం లేని కొందరు తల్లిదండ్రులు కూడా సక్రమ దత్తతపై అవగాహన లేక పురిటిలోని పిల్లలను దొడ్డిదారిలో కొని తెచ్చుకుంటున్నారు. చివరికి పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్నారు.
పేదరికంతో మగ్గిపోతున్న కొందరు తల్లిదండ్రులు.. తమ పిల్లలను పెంచి పోషించలేకపోతున్నారు. దీంతో కడుపారా తాము కన్న బిడ్డలను పరాయి వాళ్లకు విక్రయిస్తున్నారు. ఇదేగాక విచ్చలవిడిగా సంతానాన్ని కంటున్న ఇంకొందరు తల్లిదండ్రులు.. ఆడబిడ్డలన్న కారణంతో అమ్మకాలకు పెడుతున్నారు. ఆనోటా ఈనోటా ఈ విషయం తెలుసుకుంటున్న ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగడంతో అసలు గుట్టు రట్టవుతోంది. దీంతో అక్రమ పద్ధతిలో దత్తత తీసుకున్న వారిపై కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని ఘటనల్లో కాలే కడుపులను నింపుకునేందుకు చివరికి పిల్లలను అమ్ముకుంటున్న సందర్భలూ వెలుగుచూస్తున్నాయి. సమాజంలో తిరిగే కొందరు పెద్ద మనుషులు కూడా అక్రమ దత్తతలకు ఊతమిస్తుండడం గమనార్హం.
ఏటా ఐసీడీఎస్, ఐసీపీఎస్, పోలీస్ శాఖలు అక్రమ దత్తతలు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా చివరికి ఫలితం ఉండడం లేదు. ఈ ఏడాదిలో మణుగూరు మండలం పగిడేరు, టేకులపల్లి, ఇల్లెందు, రామవరం, కొమ్ముగూడెం, కమలాపురం, అశ్వారావుపేట, కొత్తగూడెం, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ గ్రామాల్లో కొందరు అక్రమ దత్తతలు తీసుకొని పోలీసు కేసుల్లో చిక్కుకున్నారు. వీరిలో కొంతమంది కౌన్సెలింగ్కు వచ్చి చట్టం గురించి తెలియదని రాజీ పడ్డారు. మరికొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఇప్పటికీ భద్రాచలం శిశుగృహలో పదిమంది పసి పిల్లలు అక్రమ దత్తతతో మిగిలిపోయారు.
చిన్నప్పుడే తల్లి ఒడిని వీడిన కొన్ని పసి హృదయాలకు మాత్రం దత్తత తీసుకున్న వారు భరోసానిస్తున్నారు. ఇప్పటి వరకు భద్రాచలం శిశుగృహ నుంచి ఒకరిని అమెరికా కుటుంబ సభ్యులు దత్తత తీసుకోగా, మరొకరు ఇటలీ నుంచి వచ్చి దత్తత తీసుకున్నారు. మరొకరిని చండీగఢ్ రాష్ట్రం నుంచి వచ్చి దత్తత తీసుకున్నారు. శిశుగృహ నుంచి దత్తత వెళ్లిన వారి యోగక్షేమాలను ఇక్కడి అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండడం గమనార్హం. పిల్లలు లేని వారు ఎంతోమంది దత్తత కోసం క్యూ కడుతుంటే.. అక్రమ పద్ధతిలో దత్తత తీసుకున్న మరికొందరు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
అక్రమ దత్తత నేరమని ప్రతీ సమావేశంలో అవగాహన కల్పిస్తున్నాం. అయినా కొందరిలో మార్పు రావడంలేదు. ఇందుకోసం పత్రికా ముఖంగా ప్రకటన కూడా చేశాం. సక్రమ పద్ధతిలో దత్తత తీసుకునేందుకు కారా (CARA) అనే వెబ్సైట్ ఉంది. దీని ద్వారా దత్తతకు దరఖాస్తు చేసుకుంటే సక్రమ పద్ధతిలోనే దత్తత తీసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం బాలల సంరక్షణ కమిటీ కూడా ఉంది. ప్రత్యేక టీం నిత్యం పరిశీలన చేస్తూ ఉంటుంది.