కారేపల్లి, ఏప్రిల్ 18 : సెర్ప్ ఇందిరాక్రాంతి పధంలో పని చేస్తున్న వీవోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఐకేపీ వీవోఏ సంఘం జిల్లా కార్యదర్శి కుర్ర శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం కారేపల్లి మండలం గాంధీనగర్లో వీవోఏ ల యూనియన్ మహాసభ జరిగింది. ఈసభలో కుర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ వీవోఏలపై పని భారం పెరిగిందని, పనికి తగ్గ వేతనం అందటం లేదని వెల్లడించారు. వీవోఏలకు రూ. 25 వేలు వేతనం ఇవ్వాలని, అర్హత ఉన్న వీవోఏల ను సీసీ లుగా పదోన్నతి కల్పించాలని ఆయన కోరారు.
అలానే జీవో నెం. 58ను సవరించి వేతనాలను వీవోఏల వ్యక్తిగత ఖాతాలో నేరుగా జమ చేయాలని ఐకేపీ వీవోఏ సంఘం జిల్లా కార్యదర్శి కుర్ర శ్రీనివాసరావు కోరారు. రూ.10 లక్షల బీమా సౌకర్యంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన డ్రెస్ కోడ్, ఐడీ కార్డులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీవోఏలకు ట్యాబ్, నెట్ సౌకర్యం కల్పించాలని, గ్రేడింగ్ విధానం రద్దు చేయాలని శ్రీనివాస రావు డిమాండ్ చేశారు.
సింగరేణి మండల వీవోఏ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షులుగా కుర్ర శ్రీనివాసరావు, కార్యదర్శిగా ధారావత్ సంగీత, కోశాధికారిగా పప్పుల నిర్మల, ఉపాధ్యక్షులుగా ధారావత్ బుజ్జి, సహాయ కార్యదర్శిగా తురపాకా విజయనిర్మల, గౌరవ అధ్యక్షురాలుగా ఇరప సుహాసిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా బర్మావత్ పోతు రమాదేవి, ప్రచార కార్యదర్శిగా కొలిశెట్టి శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులుగా ఎలుక లాజరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.