ఖమ్మం/ కొత్తగూడెం అర్బన్/ కారేపల్లి/ తల్లాడ/ మణుగూరు టౌన్, సెప్టెంబర్ 15 : కొణిజర్ల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజులపై ప్రభుత్వం ఇటీవల పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. యూరియా సరఫరా విషయంలో ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోకుండా జర్నలిస్టులపై కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. టీ న్యూస్ జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) నాయకులు, వివిధ ప్రెస్క్లబ్ల జర్నలిస్టులు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఖమ్మంలో టీజేఎఫ్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు చేబూని ర్యాలీ నిర్వహించారు. జడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కొత్తగూడెంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తల్లాడ, కారేపల్లి ప్రెస్క్లబ్ల ఆధ్వర్యంలోనూ ఆయా మండలాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించి నిరసన తెలిపారు. ఖమ్మంలో జరిగిన ఆందోళనకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు, కొత్తగూడెంలో చేపట్టిన ధర్నాకు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మంలో చేపట్టిన నిరసనలో టీజేఎఫ్, ఐజేయూ నేతలు మాట్లాడుతూ.. టీ న్యూస్ జర్నలిస్టులు తమ విధుల్లో భాగంగా యూరియా కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపడమే జర్నలిస్టుల విధి అని గుర్తు చేశారు.
కేసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా సంఘాల నాయకులు ఆకుతోట ఆదినారాయణ, కె.రాంనారాయణ, ఏనుగు వెంకటేశ్వరరావు, చిర్రా రవి పాల్గొన్నారు. కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో టీజేఎఫ్ నాయకులు కల్లోజి శ్రీనివాస్, జునుమాల రమేశ్, టీడబ్ల్యూజేఎఫ్ నాయకుడు దాసరి వెంకటేశ్వరరావు(డీవీ) తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రామకృష్ణకు, ఎస్పీ రోహిత్రాజుకు వేర్వేరుగా వినతిపత్రాలు అందించారు. కొత్తగూడెంలో చేపట్టిన నిరసనకు వివిధ పార్టీల నాయకులు గుమ్మడి నర్సయ్య, వనమా రాఘవేందర్రావు, అన్నవరపు సత్యనారాయణ తదితరులు సంఘీభావం ప్రకటించారు.