ఖమ్మం, ఆగస్టు 20: గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఐటీ, ఫార్మా, వైద్యారోగ్య రంగాల్లో గొప్పగా ఎదిగిన తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐఐఎం సవరణ -2025 బిల్లును బుధవారం రాజ్యసభలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. అస్సాంలోని గౌహతిలో రూ.550 కోట్లతో ఐఐఎం నెలకొల్పాలనే బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందన్నారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందిన దృష్ట్యా ఐఐఎంను తెలంగాణలో నెలకొల్పేందుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.