కారేపల్లి, మార్చి 29 : ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని జామే మసీద్‌లో శనివారం రాత్రి మండలానికి చెందిన ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం ఉపవాస దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు. ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జామే మసీద్ కమిటీ సభ్యులతో పాటు ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.