మధిర, నవంబరు 12 : ఎవరికైనా వారం పైబడిన ఎడతెరిపి లేని దగ్గు, జ్వరం, శరీర బరువులో మూడో వంతు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తెమడ పరీక్ష చేయించుకోవాలని ఖమ్మం జిల్లా క్షయ వ్యాధి నిర్మూలనా అధికారి డాక్టర్ వరికుటి సుబ్బారావు సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి వ్యాధి తగ్గే వరకు ఉచిత మందులు సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం చింతకాని మండలంలోని గాంధీనగర్ గ్రామంలో గల క్షయ వ్యాధిగ్రస్తురాలి ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవల గురించి స్వయంగా ఆరా తీశారు. వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి బలమైన పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి న్యూట్రిషన్ కిట్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు గ్రామాల్లోని క్షయ రోగులను సందర్శించి, వారికి మందులతో పాటు మనోధైర్యాన్ని, నమ్మకాన్ని కల్పించాలన్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం సిబ్బందిని కూడా క్షయ వ్యాధిగ్రస్తులను తరచూ సందర్శించి, వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు. గాంధీనగర్ గ్రామంలోని ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అనుమానం ఉన్నవారిని వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపాలని సూచించారు. చింతకాని మండలాన్ని క్షయ రహిత మండలంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతకాని వైద్యాధికారి ఆల్తాఫ్, పిఎండిటి టిబిహెచ్ఐవి కో ఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, టీబీ నోడల్ ఆఫీసర్, హెల్త్ సూపర్ వైజర్ కృష్ణారావు, టీబీ సూపర్వైజర్ ఇమామ్, ఆశా కార్యకర్తలు సఫియా, ఈశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.