మధిర, జూలై 19 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పోరుబాట తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం మధిరలోని భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా 23వ -మహాసభలు పోటు ప్రసాద్ నగర్ (రెడ్డి గార్డెన్స్) లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహా సభలకు ముందు పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఎగురవేశారు. మృతవీరుల స్మారక స్థూపాన్ని రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. అప్పులున్నాయని హామీలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తే సీపీఐ పోరుబాట పట్టక తప్పదని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో తమ బలానికి అనుగుణంగా పొత్తులు కుదిరితే కలిసిపోటీ చేస్తామని, లేదంటే ఒటరిపోరుతో తమ సత్తా చాటుతామన్నారు. బిజేపి నేతలు మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రశ్నించే వారిని లేకుండా చేయాలని చూస్తున్నారని, ఈ క్రమంలోనే మావోయిస్టులను తుదముట్టిస్తామని అమితా షా లాంటివారు ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. ప్రజల పక్షాన కమ్యూనిస్టులు బహుముఖ పోరాటాలకు సిద్ధం కావాలని, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వాతంత్య్రానంతరం అనేక చారిత్రక పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ నేతృత్వం వహించిందని, ఈ నేపధ్యంలో ఖమ్మం జిల్లా ఉద్యమ కేంద్రంగా బాసిల్లిందని సీపీఐ రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మహాసభలో ఆయన మాట్లాడుతూ.. లౌకికవాదం, సోషలిస్టు మొదలైన పదాలను రాజ్యాంగం నుండి తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ఆ కుట్రలు, మతోన్మాదం, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
జమ్ముల జితేందర్ రెడ్డి, మందడపు రాణి, అజ్మీరా రామ్మూర్తి, దొండపాటి రమేశ్, మేకల శ్రీనివాసరావు, ఎంగల ఆనందరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ మహాసభలో జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ఎర్రా బాబు, ఎస్ కే జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, ఆహ్వాన సంఘం బాద్యులు కర్నాటి రాంమోహన్ రావు, బెజవాడ రవిబాబు, ఎంఏ రహీమ్, వూట్ల కొండలరావు పాల్గొన్నారు.