‘పల్లెలు దేశానికి పట్టు గొమ్మలు.. గ్రామాలు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగున్నట్లు లెక్క..’ ఉమ్మడి పాలనలో గ్రామాలు నిరాదరణకు గురయ్యాయి.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.. సమస్యలన్నీ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్నట్లు ఉండేవి. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి గ్రామాభివృద్ధిపై దృష్టి సారించారు.. జనాభా ప్రాతిపదికన పెద్ద పంచాయతీలను విడదీసి చిన్న చిన్న పంచాయతీలు ఏర్పాటు చేశారు. దీంతో పాలన, పారిశుధ్య నిర్వహణ సులభమైంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలుకు శ్రీకారం చుట్టారు.. స్థానిక సంస్థలను బలోపేతం చేశారు.. విడతల వారీగా ప్రతిష్ఠాత్మకంగా ‘పల్లె ప్రగతి’ అమలు చేశారు. గ్రామగ్రామాన వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు నిర్మించారు. పారిశుధ్య నిర్వహణకు ట్రాలీ, ట్రాక్టర్ కేటాయించారు. మొక్కలకు నీరు పోసేందుకు ట్యాంకర్ సమకూర్చారు.. గ్రామ గ్రామాన పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు.. మొత్తంగా గ్రామాలను అభివృద్ధికి కేరాఫ్ చేశారు. ఇదే ఒరవడిలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే గ్రామాలకు మంచి జరుగుతుందని, ప్రతి గ్రామం నందనవనం అవుతుందని వివిధ గ్రామాల సర్పంచ్‌లు అభిప్రాయపడ్డారు.. పల్లెలపై ప్రేమ ఉన్న నేతగా ప్రతి పల్లెనూ రోల్‌మోడల్ చేస్తారంటున్నారు.
– ఖమ్మం, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ముందుచూపు ఉన్న నేత కేసీఆర్..
స్వరాష్ట్రం రాకముందు ఉమ్మడి పాలకులు పల్లెలను పట్టించుకోలేదు. తెలంగాణలోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమైంది. కేసీఆర్ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పల్లెలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. గతంలో గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం నిలిచి ఉండేది. మురుగు రోడ్డు మీదే ప్రవహించేది. విష జ్వరాలు ప్రబలి ఇంటికి ఒకరు ఆస్పత్రి పాలయ్యేవారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ సమకూరింది. మల్టీ పర్పస్ వర్కర్లు నియమితులయ్యారు. దీంతో పారిశుధ్య నిర్వహణ పక్కాగా అమలవుతున్నది. ఇప్పుడు విష జ్వరాల మాటే లేదు. పల్లె ప్రగతి పనులు, నిత్యం పారిశుధ్య పనులతో పల్లెలు సుభిక్షంగా ఉన్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశంలోని పల్లెలన్నీ ఇలాగే మారతాయి. అంతటి విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్.
– కోటి అనంతరాములు, సర్పంచ్, వెంకటాపురం, ముదిగొండ మండలం
దేశ ప్రజలకు సంక్షేమ ఫలాలు..
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపిన సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరం. దేశానికే పట్టుగొమ్మలైన గ్రామాలను సీఎం కేసీఆర్ అభివృద్ధి బాట పట్టించారు. గ్రామాలు పరిశుభ్రత, పచ్చందాలతో కళకళలాడేలా తీర్చిదిద్దారు. తండాలను, గూడేలను పంచాయతీలుగా చేసి అభివృద్ధిలో ముందుంచారు. అందుకు ఫలితంగా జాతీయ స్థాయిలో అనేక గ్రామాలకు స్వచ్ఛ అవార్డులు సైతం వచ్చాయి. దేశం అభివృద్ధి పథంలో సాగాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరికీ అందించాలి.
-బోడా పద్మ, సర్పంచ్, అన్నపురెడ్డిపల్లి
దేశ రాజకీయాల్లో మార్పులు..
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్.. దేశాన్ని కూడా బంగారు భారత్‌గా అభివృద్ధి చేయగలరు. ఆ సత్తా ఆయనకు మాత్రమే ఉంది. కేసీఆరే దేశానికి శ్రీరామరక్ష అనే నమ్మకం ప్రజల్లో కలుగుతోంది. ఎనిమిదేళ్లలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపే దేశం చూస్తోంది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కావాల్సిన పూర్తి అవగాహన ఆయనకు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా పేదలకు అందిస్తాడనే విశ్వాసం ప్రజల్లో పెరిగింది. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోకి రావడాన్ని వారు స్వాగతిస్తున్నారు. దేశంలో రైతులను ఆదుకునే ఆపద్బాంధవుడు కేసీఆర్ మాత్రమే. అందుకే ఆయన జాతీయ పార్టీ ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలి. ఆయనతోనే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
-జాటోత్ జాయ్‌లూసీ, ముచ్చర్ల సర్పంచ్, కామేపల్లి
కేసీఆర్‌తోనే బంగారు భారతం..
సీఎం కేసీఆర్‌తోనే భారతదేశం బంగారుమయమవుతుంది. పూర్వకాలంలో భారతదేశాన్ని భాగ్యసీమ, అన్నపూర్ణ అనే పేర్లతో పిలిచేవారు. వ్యవసాయమే ప్రధానంగా ఉండేది. అలాంటి వ్యవసాయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనుమరుగు చేస్తోంది. నల్ల చట్టాలను తెచ్చి అన్నదాతలను సాగుకు దూరం చేస్తోంది. పంటలపై కార్పొరేట్ శక్తులకు పెత్తనం ఇచ్చేలా చట్టాలు చేస్తోంది. మొన్నటికి మొన్న ఇలాంటి చట్టాలనే తేవడంతో దేశ రైతులందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. సుమారు ఏడాదికిపైగా వారు ఉద్యమించారు. దీంతో కేంద్రం ప్రభుత్వం దిగి వచ్చి ఆ నల్ల చట్టాలను రద్దు చేసింది. అదే సమయంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి జవసత్వాలు పోశారు. సాగుకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వడం, పంటల పెట్టుబడికి రైతుబంధు పథకం ద్వారా సాయం అందించడం వంటివి దేశ రైతులను ఆలోచింపజేశాయి. దీంతో తమకూ అలాంటి నాయకుడు కావాలని అన్ని రాష్ర్టాల రైతులూ కోరుకుంటున్నారు. ఇటీవల ఆయా రాష్ర్టాల రైతు సంఘాల నాయకులు కూడా వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి వెళ్లారు.
-కళ్లెం వెంకటరెడ్డి, సర్పంచ్ గోళ్లపాగు, ఖమ్మం రూరల్
బీజేపీని ఎదిరించే సరైన నాయకుడు కేసీఆరే..
దేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రంలోని బీజేపీని ఎదిరించే నాయకుడు కేసీఆరే. ఇప్పటికే కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ పోరాడుతున్నారు. తన మాట వినని రాష్ర్టాల నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే సమర్థంగా తిప్పికొడుతున్నారు. అందుకే సీఎం కేసీఆర్ దేశానికి ఆశాదీపంలా కన్పిస్తున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలను తెలంగాణను బంగారుమయం చేసిన కేసీఆర్ పట్ల దేశ ప్రజలందరూ ఎంతో విశ్వాసంతో ఉన్నారు. ఇంతటి అభిమానం ఉన్న నేతకు దేశంలోని అన్ని రాష్ర్టాల్లోనూ అపూర్వ ఆదరణ లభిస్తుంది. తెలంగాణ సమాజం కూడా సీఎం కేసీఆర్ వెనుకే నడుస్తుంది.
-బాలునాయక్, సర్పంచ్ తీర్థాల, ఖమ్మం రూరల్
దేశ భవిషత్తు కేసీఆర్ చేతుల్లో ఉంది..
కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరం. దేశ ప్రజల భవిషత్తును మార్చ గల విజన్ కేసీఆర్‌కు ఉంది. తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపినట్లుగానే దేశాన్ని అగ్రస్థానంలో నిలుపగలరు. సంక్షేమ పాలనపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. దేశంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ పథకాలను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశమంతటా సంక్షేమ పథకాలు అమలవుతాయి. ప్రజల జీవితాలను మారుస్తాయి.
– ఆజ్మీరా జగదీశ్, సర్పంచ్, పాండురంగాపురం తండా, పాల్వంచ మండలం
బీజేపీని ఎదుర్కోగల నాయకుడు కేసీఆరే..
బీజేపీని సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఉన్ననేత కేసీఆర్. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వంటి నేత రావాలి. దేశానికి రైతాంగ సమస్యలపై స్పష్టత ఉండి వాటిని పరిష్కరించే సమర్థత ఉన్న నాయకుడు కావాలి. సరిగ్గా అలాంటి నాయకుడే కేసీఆర్. రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదనేది పెద్దల సామెత. అలా బీజేపీ సర్కార్ రైతుల ఉసురు పోసుకుంటున్నది. కేసీఆర్‌తో రైతాంగ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇచ్చిన మాటలను ఆచరణలోకి పెట్టే నేత కేసీఆర్.
– దొడ్డపనేని శ్రీదేవి, సర్పంచ్, కొత్తకారాయగూడెం, పెనుబల్లి మండలం
దేశ భవిష్యత్ సీఎం కేసీఆర్ చేతుల్లోనే
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ వంటి నాయకుడి అవసరం ఉంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కేసీఆర్‌తోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు. పంటలకు ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్. ఇంకా ఇలాంటి వినూత్న పథకాలెన్నో కేసీఆర్ అమలు చేస్తారు. కేసీఆర్ కచ్చితంగా జాతీయ రాజకీయాల్లో రాణిస్తారు. ప్రజలందరికీ మేలు చేస్తారు.
– కనకపుడి పెద్దబుచ్చయ్య, సర్పంచ్, సిరిపురం, మధిర మండలం
మహిళా సాధికారత కేసీఆర్‌తోనే సాధ్యం
మహిళా సాధికారత కేసీఆర్‌తోనే సాధ్యం. మహిళల భద్రతపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పటికే రాష్ట్రంలో షీటీంలు ఏర్పాటు చేశారు. సఖి, భరోసా కేంద్రాలు నడిపిస్తున్నారు. స్టార్టప్‌ల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆడపిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. గర్భిణులకు ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఏటా బతుకమ్మ చీరెను సారెగా ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. ఇలా మహిళలను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం మహిళలను పట్టించుకోవడం లేదు. వారి కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. నిత్యావరాలు, పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రధాని కావాలి. దేశవ్యాప్తంగా మహిళలకు సంక్షేమ పథకాలు అందించాలి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి.
– కానుగ సుజాత, సర్పంచ్, చిరుమర్రి, ముదిగొండ మండలం
దేశానికి కేసీఆర్ సేవలు అవసరం..
జాతీయ పార్టీ స్థాపించి జాతీయ రాజకీయాల్లో రాణించగల సత్తా కేసీఆర్‌కు ఉంది. రాష్ట్రంలో అన్నివర్గాలకు సమన్యాయం చేస్తున్నట్లుగానే దేశప్రజలందరికీ న్యాయం చేయగల విజన్ ఆయనకున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావడం అవసరం. ఆర్థిక సంక్షోభాన్ని సునాయాసంగా ఎదుర్కోగల శక్తి ఆయనకున్నది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలంటినీ దేశవ్యాప్తంగా అమలు చేసి ప్రజలకు మేలు చేస్తారనే నమ్మకం ఉంది. సరైన సమయంలో సరైన నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు.
– కొర్సా లక్ష్మి, సర్పంచ్, ఇరవెండి, బూర్గంపహాడ్ మండలం
దేశ రాజకీయాల్లో కేసీఆర్ చరిత్ర సృష్టించాలి
ఉద్యమించి స్వరాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించాలి. జాతీయ రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తారు. ఇప్పటికే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. అలాగే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశ ప్రజలందరికీ మేలు చేస్తారు. అంతటి సమర్థత ఆయనకున్నది.
– కారం ముత్తయ్య, సర్పంచ్, గుట్టమల్లారం, మణుగూరు మండలం
దేశ రాజకీయాల్లో కేసీఆర్ రాణిస్తారు..
కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నారు. గతంలో రూ.వందల్లో ఉన్న పింఛన్‌ను రూ.2016 చేశారు. దివ్యాంగులకు ఏకంగా రూ.3,016 చేశారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నారు. పంటలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు అమలు చేస్తున్నారు. తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపారు. ఉద్యోగులతో కలిసి ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. పల్లెలను అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వంటివి దేశమంతా అమలు చేయాలి. ప్రస్తుతం దేశానికి అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం ఉంది. పట్టు వీడకుండా రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ దేశరాజకీయాల్లోనూ రాణిస్తారు. జాతీయ పార్టీ స్థాపించి విజయం సాధిస్తారు.
– ఒగ్గు విజయలక్ష్మి, సర్పంచ్, కొత్తూరు, సత్తుపల్లి మండలం
అందరినీ ఒకేతాటిపైకి తెచ్చే సత్తా కేసీఆర్‌కు ఉంది..
దేశంలో బీజేపీని వ్యతిరేకించే అన్ని పారీలు, నాయకులను ఏకతాటిపైకి తెచ్చే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉంది. దేశాన్ని పాలించే అనుభవం కేసీఆర్‌కు పుష్కలంగా ఉంది. ఆంధ్రా పాలకుల కుట్రలను తిప్పికొట్టి రాదనుకున్న తెలంగాణను సాధించి చూపించారు. దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల సత్తా ఆయనకున్నది. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వంటి యావత్ దేశంలో అమలు చేస్తారు. దేశ ప్రజల అభిమానాన్ని చూరగొంటారు. ఇప్పటికే యావత్ భారత్ తెలంగాణ వైపు చూస్తున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే కచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది.
– మందపాటి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్, గంగారం, సత్తుపల్లి మండలం
దేశానికి కేసీఆర్ అవసరం ఉంది
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ అవసరం ఉంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పాలనలో పూర్తిగా విఫలమైంది. గుజరాత్ మోడల్‌ను అనుసరించి అన్నిరంగాలను నాశనం చేసింది. దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని ముంచేసింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే కచ్చితంగా వ్యవసాయరంగాన్ని గాడిలో పెడతారు. తెలంగాణలో యువకులు సైతం వ్యవసాయ రంగాన్ని ఎంచుకుంటున్నారంటే దానికి కారణం కేసీఆర్. ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. దేశంలో అపారమైన వనరులు ఉన్నాయి. కానీ వాటిని వినియోగించి ప్రజలకు మేలు చేసే అభివృద్ధి నమూనా బీజేపీ వద్ద లేదు. అలాంటి ఆలోచనలు కలిగిన నేత కేసీఆర్. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళితే దేశానికి దిక్సూచిగా మారతారు. సామాన్యుడి కష్టాలు తీరుస్తారు.
– మందపాటి వేణుగోపాల్ రెడ్డి,సర్పంచ్, మర్లపాడు, వేంసూరు మండలం
దేశ్ కీ నేత కేసీఆర్..
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందజేస్తున్నారు. ఆదర్శ పాలన అందిస్తున్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళితే దేశ ప్రజల రాత మారుతుంది. దేశప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. ప్రస్తుతం తెలంగాణలో ప్రతి ఇంటికీ ఒక పథకంతోనైనా లబ్ధి చేకూరిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కల్యాణలక్ష్మి, ఆసరా, రైతుబంధు, రైతుబీమా ఇలా ఏదో ఒక సంక్షేమ పథకం ఇంటింటికీ అందాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఇలాంటి పథకాలే దేశప్రజలందరికీ అందుతాయి. ఇప్పుడు దేశమంతా కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నది.
– భూక్యా పంతులి, సర్పంచ్, వీఎం బంజరు, పెనుబల్లి మండలం