మామిళ్లగూడెం, జనవరి 18: కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీ సీటు అడిగే హక్కు కేవలం తనకే ఉందని, అలాగే పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే తనకూ సంతోషమేనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి జిల్లా అభివృద్ధి కోసం పని చేశానన్నారు. జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయించానని, ఖమ్మం- గార్ల వరకు రైల్వే ప్లాట్ ఫాంలను ఆధునీకరించామన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అవసరమైతే భవిష్యత్తులో తమ పార్టీ టీడీపీతో కలిసి పనిచేస్తుందన్నారు. భద్రాచలంలోని రామాలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి, అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీరాముడితో ఓట్ల రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే రాముడి ప్రతిష్ఠ చేయడం బాధాకరమన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ చర్యకు పూనుకున్నదని ధ్వజమెత్తారు.